Mahabubnagar | మహబూబ్నగర్ అర్బన్ : అంగన్వాడీ కేంద్రాల్లో ఆట, పాటలు, అనుకరణ ద్వారా పిల్లలకు విద్యాబోధన చేస్తారని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం అన్నారు. జిల్లా కేంద్రం క్రిస్టియన్ కాలనీలో గల కమ్యూనిటీహాల్లో మంగళవారం అమ్మ మాట – అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగం మాట్లాడుతూ.. అమ్మ ఒడి తర్వాత మలి బడి అంగన్వాడీ కేంద్రాలు అని అన్నారు. పిల్లలు ఐదేళ్లు నిండిన తర్వాత బడికి చేరే లోపు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. పిల్లలు కోరుకునే విధంగా సంభాషణ, ఆట, పాటలతో విద్యాబోధన చేస్తారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించాలని, త్వరలో ప్రభుత్వం నుంచి యూనిఫామ్లు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో సిడిపిఓ రాధిక, సూపర్ వైజర్ వలీమ్ సుల్తానా, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సిబి పూజిత, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.