
పౌల్ట్రీ, డెయిరీ రంగాలకు ఆస్తి పన్ను రద్దు
వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతం
ప్రతి యూనిట్ విద్యుత్ బిల్లుకూ రూ. 2 తగ్గింపు
పన్ను రద్దుపై సర్వత్రా హర్షం
మహబూబ్నగర్ జూన్ 3 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల పరిధిలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును మినహాయించడంతో పాటు విద్యుత్ బిల్లుల్లోనూ భారీగా రాయితీలు ప్రకటించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పౌల్ట్రీ, డెయిరీ పరిశ్రమలకు పన్ను మినహాయింపునిస్తూ పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. జీవోలు జారీ చేయడంపై రెండు రంగాలకు చెందిన రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఆస్తిపన్ను రద్దు చేయడంతో పాటు విద్యుత్ బిల్లులు సైతం భారీగా తగ్గించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ, డెయిరీలకు ఆస్తి పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తూ ఏడాదికి రూ. 100 నామమాత్రపు పన్నును చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయంతో సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు ఎంతో ఊరట లభిస్తుందని రైతులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ రంగంలోకి మరింత మంది వచ్చి పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి అనేక మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంటున్నారు. మరోవైపు పౌల్ట్రీ, డెయిరీ పరిశ్రమలు రెండూ వృద్ధి చెందడం వల్ల రైతులు పండించే మక్కలు, ధాన్యాన్ని ఈ రంగాలు కొనుగోలు చేసి వ్యవసాయానికి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి లభ్యత భారీగా పెరిగిన తరుణంలో ధాన్యం, మక్కలు భారీగా పండిస్తున్నారు. ఈ రెండు పంటల్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది. బియ్యం ఆడించిన తర్వాత వచ్చే తవుడు, నూకలు, పరం ప్రధానంగా పౌల్ట్రీ రంగంలోనే వినియోగిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఈ రెండు రంగాలకు రాయితీలు ప్రకటించారని భావిస్తున్నారు.
ఏడాదికి రూ. 100 చెల్లిస్తే చాలు
పౌల్ట్రీ, డెయిరీ పరిశ్రమలకు సంబంధించి ఆస్తి రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా ఏడాదికి ప్రతీ యూనిట్(పరిశ్రమ)కు రూ.100 నామమాత్రపు పన్నును ఆయా యూనిట్లు చెల్లించాలని పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేశాయి. ప్రస్తుతం వాణిజ్య, గృహ కేటగిరీల కింద ఈ యూనిట్ల నుంచి స్థానిక సంస్థలు ఆస్తిపన్ను వసూలు చేస్తున్నాయి. భారీ విస్తీర్ణం దృష్ట్యా ఇది ఎక్కువగా ఉంటోంది. చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలు సైతం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలిసిపోయాయి. మరికొన్ని చోట్ల మేజర్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారాయి. దీంతో ఆస్తిపన్ను భారీగా చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. తాజా ఉత్తర్వులతో దాని నుంచి విముక్తి కలిగిందని కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ యూనిట్ల యజమానులు చెబుతున్నారు. రాష్ర్టాన్ని పౌల్ట్రీ, డెయిరీ రంగాల్లో అత్యున్నత స్థానంలో నిలిపేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
నెలకు రూ.50లక్షల విద్యుత్ బిల్లులు
పౌల్ట్రీకి కరెంటు బిల్లు యూనిటుకు రూ.8 చొప్పున వసూలు చేస్తున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.2 తగ్గించారు. దీంతో ప్రతి యూనిట్ పై రూ.6మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 400 పౌల్ట్రీల్లో కోటి లేయర్ కోళ్లున్నాయి. ఒక్కో పరిశ్రమ మీద సుమారు నెలకు రూ. 4వేల బిల్లు తగ్గుతుంది. ఈ లెక్కన 400 యూనిట్లకు రూ. 16 లక్షలు నెలకు ఆదా అవుతుంది. ఇక బాయిలర్ కోళ్లు ఉమ్మడి జిల్లాలో 50 లక్షల సామర్థ్యం ఉన్న 1000 పౌల్ట్రీలున్నాయి. ఒక్కో పౌల్ట్రీపై నెలకు రూ. 2వేలు ఆదా చొప్పున లెక్కించినా రూ. 10 లక్షలు ఆదా అవుతున్నది. ఇక ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 హ్యాచరీస్ బిల్లులు సైతం నెలకు తక్కువకు తక్కువ రూ. 24 లక్షలు తగ్గుతున్నాయి. అన్నీ కలిపి సుమారు రూ. 50 లక్షల వరకు విద్యుత్ బిల్లుల ఆదా అవుతున్నది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు ఈ నిర్ణయం వల్ల నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని పౌల్ట్రీ రైతులు భావిస్తున్నారు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఎంతో సంతోషాన్నిస్తోందని అంటున్నారు.