ఆత్మకూరు, జూన్ 6 : ఈ ఏడాది జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో చెరో యూనిట్లో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎగువ జూరాలలోని 6వ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించగా, దిగవ జూరాలలో 3వ యూనిట్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఎస్ఈ జయరాం మాట్లాడుతూ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న సాధారణ వర్షాలకు, కొన్ని రోజులుగా ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేయగా.. ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతుందన్నారు. దీంతో ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు విద్యుదుత్పత్తిని ప్రారంభించినట్లు చెప్పారు. గతేడాదికంటే ముందుగానే ఈ ఏడాది వరదలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఎగువ, దిగువ జూరాల యూనిట్లను మే 31 వరకే సంసిద్ధం చేశామన్నారు. వరదలు ఎప్పుడు వచ్చి నా అన్ని యూనిట్లు ఉత్పత్తికి సిద్ధమన్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు నిర్విరామంగా ఒక్కో యూనిట్లో ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. రెండు యూనిట్ల నుంచి దాదాపు 80 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోందని ఎస్ఈ వివరించారు. ఇరిగేషన్ అధికారుల సమన్వయంతోనే గతంలో విద్యుదుత్పత్తి రికార్డులు నెలకొల్పామని వివరించారు. ఈ ఏడాది సైతం వారి సహకారంతో మెరుగైన విద్యుదుత్పత్తిని సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.