అయిజ, మార్చి 20 : గ్యాస్ కోసం వినియోగదారులు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురిస్తుండటంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, హెచ్పీ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు స్పందించారు. గత నాలుగురోజులుగా ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో వినియోగదారులు పడుతున్న కష్టాలు, ఎండలకు సైతం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండటం, సిలిండర్ల కొరత వంటి అంశాలను ప్రచురిస్తుండటంతో శుక్రవారం హెచ్పీ కంపెనీ ప్రతినిధులు స్పందించి 1512 సిలిండర్లను అయిజ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీకి సరఫరా చేసింది.
అయిజ లక్ష్మీ శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీలో 43వేల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు కనీసం 750 నుంచి 900మంది కస్టమర్లు గ్యాస్ సిలిండర్ కోసం ఓటీపీలు పొందుతున్నారు. కేవలం 504సిలిండర్లు సరఫరా చేస్తుండటంతో కస్టమర్లు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇదే విషయమై మూడు రోజులుగా గ్యాస్ కొరతపై నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా జిల్లా అధికారులు, హెచ్పీ ఎల్పీజీ గ్యాస్ కంపెనీ ప్రతినిధులను అప్రమత్తం చేయడం, కస్టమర్లు పడుతున్న కష్టాలు, బాధలు, పండుగల వేళ వినియోగదారులు పడుతున్న పాట్లను వెలుగులోకి తెచ్చింది.
దీంతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్పీ కంపెనీ ప్రతినిధులకు నమస్తే తెలంగాణ కథనాన్ని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడంతో శుక్రవారం అయిజ గ్యాస్ ఏజెన్సీకి అదనపు సిలిండర్లను సరఫరా చేసిందని తెలిసింది. ఓటీపీ ఉన్న కస్టమర్లకు ఏజెన్సీ నిర్వాహకులు వెంటనే సిలిండర్లను అందజేస్తున్నారు.
జిల్లాలో గ్యాస్ కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఎస్వో స్వామికుమార్లు ప్రకటించారు. సిలిండర్ బుక్ చేసుకొన్న కస్టమర్లు వెంటనే గ్యాస్ గోదాంకు రావద్దని, బుక్ చేసుకొన్న నాలుగు రోజుల్లో సిలిండర్ తీసుకొనేందుకు వెసులుబాటు ఉందని ఏజెన్సీ నిర్వహకులు సూచించారు. అయిజలో నెలకొన్న గ్యాస్ కొరతపై వరుస కథనాలు ప్రచురించి, గ్యాస్ కష్టాలను తొలగించేందుకు కృషి చేస్తున్న నమస్తే తెలంగాణ దిన పత్రికకు కస్టమర్లు కృతజ్ఞతలు తెలిపారు.