వనపర్తి, జూలై 4 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి విద్యు త్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు చాలా రోజులనుంచి ఎ దురు చూస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం అవసరమైన డీడీలు తీసి కార్యాలయాల్లో అప్పగించి నెలలు.. సంవత్సరాలు గడిచినా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదు. వానకాలం సీజన్‌కు ముందే స్తంభా లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతులు కార్యాలయాల చు ట్టూ చెప్పులరిగేలా తిరుగుతుండగా ఇస్తాం.. వచ్చి చేస్తాం అనడం తప్పా అడుగుముందుకు పడడం లేదు. వనపర్తి విద్యుత్‌శాఖ పనితీరు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నది.
గత ప్రభుత్వంలో దరఖాస్తు లు పెట్టుకున్న రైతులకు కూడా ఇప్పటి వరకు విద్యుత్ కనెక్షన్లు ఇ వ్వడం లేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వేలాది మంది రైతులు బోరు, బావుల కోసం కరెంట్ కనెక్షన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. డీడీలు కట్టినప్పటి నుంచి రైతులు అధికారుల చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకుంటున్నారు. అధికారుల ప్రోద్బలంతో పలుచో ట్లా కాంట్రాక్టర్లు అత్యుత్సాహం చూపుతున్నా రు. సక్రమమైన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టి అడ్డదారుల్లో వచ్చిన వారికి కనెక్షన్లు అందించడం వల్లే అంతా గందరగోళం నెలకొన్నది. కొందరు కాంట్రాక్టర్లు సహితం అధికారులకు అందినంత చేయి తడిపి పనులను దక్కించుకొనే పనిలో పోటీలు పడుతున్నారు. ఈ ఖర్చులన్నీ రైతులతోనే వసూలు చేస్తున్న గుత్తేదారు లు అందినంత దోచుకుంటున్నారు. పేరుకు ఆ న్లైన్లో దరఖాస్తు చేసుకున్నా పనులు మా త్రం కాసులు ముట్టజెప్పే వారికే జరుగుతాయన్న ఆరోపణలున్నాయి.
జిల్లాలో 5 వేల మందికిపైగా..
జిల్లాలో 5,137 మంది రైతులు డీడీలు కట్టి విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీటిలో రెండేండ్ల నుంచి మొదలుకొని ఇటీవల మే నెల వరకు డీడీలు తీసిన రైతులు ఉన్నారు. జిల్లాలో రెండు విద్యుత్ సబ్ డివిజన్లు ఉండగా, వీటిలో ఒకటి వనపర్తి, మరొకటి కొత్తకోటలో ఉన్నాయి. వనపర్తి టౌన్ కలుపుకొని ఏడు మండలాలు వనపర్తికి ఉం టే, మరో ఏడు మండలాలు కొత్తకోట సబ్ డివిజన్ పరిదిలో కొనసాగుతున్నాయి. వచ్చిన దరఖాస్తులను సీనియార్టీ ప్రకారం కొత్త కనెక్షన్లను ఇవ్వాల్సి ఉంది. అలా కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నచ్చిన వారికి విద్యుత్ లైన్ ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, మంత్రి జూపల్లి కృష్ణారావు సహితం పలు దఫాలుగా నిర్వహించిన అధికారుల సమీక్షలో విద్యుత్‌శాఖ నిర్వహణపై గుర్రుగానే ఉన్నారు. రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయవద్దని చెబుతున్నప్పటికీ అధికారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
నిబంధనలు ఇలా ఉంటే..
వ్యవసాయ కనెక్షన్లకు అవసరమైన నిబంధనలు ఉన్పప్పటికీ అవి అమలు కావడం లేదు. రైతులు నేరుగా వినియోగదారుల సేవా కేం ద్రం ద్వారా కనెక్షన్ల కోసం నమోదు చేసుకోవాలి. 25 హెచ్‌పీ ట్రాన్స్ఫార్మర్ పొందాలనుకునే రైతులు రూ.5,787 చొప్పున మూడు డీడీలు ముగ్గురు రైతులు విద్యుత్‌శాఖ పేరుతో తీయాలి. అలాగే రై తు భూమి పాసుబుక్, ఇంటి కరెంట్ బిల్, రెండు ఫొటోలు ఇవ్వడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు నమోదు అవుతుంది. ఇందులో రైతులు రసీదు కూడా పొందే అవకాశం ఉంది. ఈ రసీదును ఏఈకి అందజేయడం, అనంతరం లైన్మెన్ ద్వారా రైతుకు ఏ మేర స్తంభాలు, వైరు అవసరమవుతుందో అం చనా వేసి ఆన్లైన్లో నమోదు చేస్తారు. పనులు మంజూరైన వెంటనే గుత్తేదారు ద్వారా అధికారులు పనులను చేయిస్తారు.
ఏసీబీ రైడింగ్‌లతో ఇన్చార్జీల పాలన..
ఇటీవల జిల్లా విద్యుత్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లంచాలు తీసుకుంటూ ఎస్ఈ, డీఈ, మరో ఏఈ పట్టుబడిన సంగతి విదితమే. ఈ చర్య అనంతరం ఇన్‌చార్జీలకు బాధ్యతలను అప్పగించారు. ఎస్ఈగా గద్వాల అధికారికి, స్థానికంగా ఉండే మరో అధికారికి డీఈగా బాధ్యతలు అదనంగా ఇచ్చారు. అవినీతికి నిలయ మైన విద్యుత్‌శాఖలో ఒక్కసారిగా ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడడం జిల్లాలో సెన్షేషనల్‌గా నిలిచింది.
సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం..
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ కనెక్షన్లపై త్వరలో పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తాం. అనంతరం వివరాలను ఉన్నతాధికారులకు తెలియపరుస్తాం. వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం. గడువులోగా పెండింగ్ కనెక్షన్లను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం.
– డాక్టర్ రాచప్ప, ఇన్చార్జి డీఈ, వనపర్తి
ట్రాన్స్ఫార్మర్ రాలేదు..
రెండేండ్ల కిందట కరెంట్ కనెక్షన్ కోసం డీడీ లు తీశాం. స్తంభాలు ఇచ్చారు.. వైరు రాలేదు. ట్రాన్స్ఫార్మర్ రాలేదు. ఎప్పుడు అడిగినా పై నుంచి రాలేదు అంటున్నారు. కరెంట్ రాక బో రును ఒట్టిగా వదిలేసినం. నిబంధనల ప్రకారం డీడీలు కట్టించుకొని ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడంలో అధికారులు సతాయిస్తున్నారు.
– బాలయ్య, రైతు, చిన్నదగడ, చిన్నంబావి మండలం
గత డిసెంబర్లో డీడీలు కట్టినా..
2023 డిసెంబర్లో నాలుగు డీడీలు కట్టినం. స్థానికంగా ఉండే లైన్మెన్ ద్వారా ఒక్కొక్క డీడీకి రూ.7,500 చెల్లించినం. నాతోపాటు మా బాబాయి కూడా రెండు డీడీలకు డబ్బులు కట్టాడు. వానకాలంలోపు కొ త్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు అతీగతి లేదు. అ డిగినప్పుడల్లా రాలేదు. వస్తుంది అని చెప్పడం తప్పా మరొకటి లేదు. ప నులు కానందునా మేం వేసుకున్న రెండు బోర్లు ఒట్టిగానే ఉండిపోయాయి.
– సురేశ్, రైతు, దొండాయిపల్లి, పాన్‌గల్ మండలం