మహబూబ్నగర్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీసీ రిజర్వేషన్ల ఉత్కంఠ మధ్య స్థానిక ఎన్నికల సమరం షురూ కాబోతున్నది. రెండు విడుతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, వార్డుల ఎన్నికలకు రంగం సిద్ధమతున్నది. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండగా.. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఎన్నికలు నిలిపివేయాలంటూ స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో గురువారం ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభమై ఈనెల 11వ తేదీ వరకు ముగియనున్నది. ఈనెల 12న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉండనున్నది. రెండో విడుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ 13న మొదలై 15వ తేదీతో ముగియనున్నది. నామినేషన్ల పరిశీలన 16న, 19న ఉపసంహరణ ఉండనున్నది.
ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రధాన పార్టీలు క్యాండిడేట్ల వేటలో పడ్డాయి. ఒకవైపు కోర్టులో కేసులు ఉత్కంఠ మధ్య పెద్దగా పట్టించుకోని పార్టీలు చివరి నిమిషంలో ఎన్నికలు జరుగుతుండడంతో గెలుపు గుర్రాల కోసం అన్వేషన్ ప్రారంభించాయి. కొందరు నేతలు టికెట్లు రాకపోతే వేరే పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆయా పార్టీల నేతలతో టచ్లో ఉన్నారు. మరోవైపు జంపు జిలానీలా బెడద అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది.
ఉమ్మడి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికలకు ఆయా జిల్లా కలెక్టర్లు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయగానే ఉమ్మడి జిల్లాలోని అన్నిచోట్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేశారు. గురువారం నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియపై ఆయా జిల్లాల్లో ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నామినేషన్లు స్వీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పాలమూరు జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. ఈ మేరకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, తాసీల్దార్లు, జిల్లా అధికారులతో బుధవారం ఆమె సమావేశమయ్యారు. నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడుతలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరించాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాలో 77 మండలాల్లో 77 జెడ్పీటీసీ స్థానాలకు 800 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడుత 38 మండ లాల్లో 420 ఎంపీటీసీ స్థానాలకు.. రెండో విడుతలో 39 మండలాల్లో 380 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడుతలుగా కొనసాగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామ పంచాయతీలు.. 15,128 వార్డులు ఉండగా.. ఫస్ట్ విడుతలో మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలోని 16 మండలాల్లో 388 పంచాయతీలకు నిర్వహిస్తారు. రెండో విడుతలో జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలతో పాటు మిగిలిన 29 మండలాల్లోని 648 జీపీలకు.. మూడో విడుతలో 32 మండలాల్లోని 642 పంచాయతీల్లో పోలింగ్ నిర్వహ నిర్వహించనున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు మొదటి విడుత ఎన్నికలు 23న, రెండో విడుత 27న పోలింగ్ జరగనున్నది. నవంబర్ 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు మొదటి విడత పోలింగ్ 31న, రెండో విడుత నవంబర్ 4న, మూడో విడుత 8న నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.