అయిజ, అక్టోబర్ 18 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో 11 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 70 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 85,356 క్యూసెక్కులు నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 48,057 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 43,173 క్యూసెక్కులు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటి మట్టం 1705 అడుగులకు గాను 1704.72 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి గరిష్ఠ నీటిమట్టం 129.72 టీఎంసీలకు గానూ, ప్రస్తుతం 128.19 టీఎంసీల నిల్వ ఉన్నది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 51,720 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 51,051 క్యూసెక్కులుగా నమోదైంది. గరిష్ఠస్థాయి నీటిమట్టం 1615 అడుగులకు గానూ ప్రస్తుతం 1614.50, అడుగులు ఉంది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వర ద నీరు చేరుతోంది. దీంతో 17 గేట్లు ఎత్తి 72, 915 క్యూసెక్కులు తుంగభద్ర నదికి విడుదల చేస్తున్నారు. డ్యాంకు ఇన్‌ఫ్లో 83,001 క్యూసెక్కు లు ఉండగా, అవుట్‌ఫ్లో 83,001 క్యూసెక్కులు ఉంది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 101.500 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 53,270 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 52,600 క్యూసెక్కులు నమోదైంది.