జోగులాంబ గద్వాల : భారత్ మాలా రహదారి ( Bharatmala Highway) నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయపరంగా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector Santosh ) అన్నారు.
జాతీయ రహదారి నిర్మాణానికి భూములు కోల్పోయిన అయిజ మండలం బింగిదొడ్డి, జడ దొడ్డి గ్రామాల రైతులతో శుక్రవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల నుంచి ప్రత్యక్షంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూములు కోల్పోయిన ప్రతి రైతుకూ న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
నష్టపరిహారాన్ని పెంచే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో చర్చలు జరుపుతు న్నామని, తగిన నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రైతులు సర్వీస్ రోడ్ సమస్యను కలెక్టర్ దృష్టికి రాగా పరిశీలించి, అవసరమైతే మార్పులు చేసి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. రైతులు సహకరిస్తే మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.