గద్వాల, డిసెంబర్ 27 : న్యాయవాదుల భిన్నాభిప్రాయాలతో జిల్లా ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయితే అప్పుడు పూడురు శివారులో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం పదేకరాల స్థలం కేటాయించింది. అప్పుడే కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.91 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కోర్టుకు శంకుస్థాపన జరిగే క్రమంలో స్థల విషయంపై న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోవడంతో కోర్టు నిర్మాణ శంకుస్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి.
గతంలో పూడురు శివారులో 368 సర్వే నెంబర్లో పదె ఎకరాలు కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన సమయంలో న్యాయవాదులు అంగీకరించిన తర్వాత ఉన్నతాధికారులకు పంపారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేస్తే ఇబ్బందులు కలుగుతాయని కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి పీజేపీ ఆవరణలో ఉన్న స్థలం కేటాయించాలని న్యాయవాదులు కోరుతున్నారు. అప్పుడు అందరి అంగీకారంతో ఆ స్థలం అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలానికి న్యాయవాదులు నో అనడంతోపాటు వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాల కారణంగా న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయారు. విధులు బహిష్కరించి రిలే దీక్షకు పూనుకోవడంతో పలు కేసుల్లో కోర్టుకు వస్తున్న కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం పూడురు శివారులోని పుటాన్పల్లి వద్ద కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే తమకు అనుకూలంగా ఉందని అప్పటి బార్అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్, కార్యదర్శి శ్రీధర్ అందరీ న్యాయవాదుల సమక్షంలో అప్పటి కలెక్టర్ శృతిఓజాను ఒప్పించి 2019-20లో పదెకరాల భూ కేటాయింపులు చేశారు. 2023-24లో అప్పటి బార్అసోసియేషన్ అధ్యక్షుడు శోభారాణి ఉన్న సమయంలో ఇక్కడ జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కనకదుర్గ ప్రభుత్వం కేటాయించిన భూమిని కోర్టుకు అప్పగించింది. అయితే ప్రస్తుతం న్యాయవాదులు పుటాన్పల్లి వద్ద కోర్టు కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడితే కక్షిదారులు, న్యాయవాదులు, అధికారులకు ఇబ్బందులు కలుగుతాయని అక్కడ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం వద్దంటూ బార్సోసియేషన్లోని కొందరు న్యాయవాదులు కోరుతున్నారు. మరికొంత మంది న్యాయవాదులు ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణాన్ని గతంలో చూపిన స్థలంలోనే చేపట్టాలని మరో వర్గం వాదిస్తుంది. దీంతో ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణంపై సందిగ్ధత నెలకొంది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. జిల్లా ఏర్పాటుకాక ముందు గద్వాలలో మూడో అదనపు జిల్లా కోర్టు, సబ్‌కోర్టు, మున్సిఫ్ కోర్టులుండేవి. జిల్లా ఏర్పాటైనా తర్వాత కొత్తగా ఆరు కోర్టులు జిల్లాకు అదనంగా వచ్చాయి. అందులో జిల్లా కోర్టు, అదనపు సబ్‌కోర్టు, స్పెషల్ఫాస్ట్రాక్, రేప్ అండ్ పోక్సో కోర్టు, అడిషనల్ మున్సిఫ్ కోర్టు, జువైనైల్ బోర్డు, జిల్లా లీగల్‌సెల్ అథారిటీ కోర్టులు వచ్చాయి. వీటితోపాటు జిల్లాకు మరిన్ని కోర్టులు వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు, వినియోగదారుల ఫోరం కోర్టు, ఫ్యామీలి కోర్టు, మోటర్ వెహికిల్ యాక్సిడెంట్ కోర్టు, ఎక్సైజ్ కోర్టు, ఏసీబీ కోర్టుతోపాటు పలు కోర్టులు వచ్చే అవకాశం ఉన్నది. దీంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి పుటాన్పల్లి స్టేజీ సమీపంలో అప్పటి ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే దీనిని బార్ అసోసియేషన్‌లో ఉన్న న్యాయవాదులు కొందరు స్వాగతిస్తుండగా మరి కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు.
జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లా నలుమూలల వివిధ రకాల కార్యాలయాల ఏర్పాటు తప్పనిసరి. రాబోవు కాలంలో జనాభా పెరిగితే జనాభాకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు ఉంటేనే జిల్లా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. జిల్లా చుట్టుపక్కల వివిధ కార్యాలయాలు ఏర్పాటైతే పేదలకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు వివిధ రంగాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఒక రంగం అభివృద్ధి చెందితే దానిపై పది రకాల ఆదాయ మార్గాలు ప్రజలకు లభించే అవకాశం ఉంటుంది. జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అయిజ రహదారిలో పరుమాల శివారులో డబుల్బెడ్రూం ఇండ్లతోపాటు నర్సింగ్, మెడికల్ కళాశాల, జిల్లా దవాఖాన అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. జూరాలకు వెళ్లే దారిలో ఐటీఐ కళాశాల, కర్నూల్ వెళ్లే రహదారిలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ దిశగా గత ప్రభుత్వం ఆలోచించి కర్నూల్‌కు వెళ్లే రహదారి సమీపంలో కోర్టు కాంప్లెక్స్‌కు స్థలం కేటాయించినట్లు తెలుస్తుంది. జిల్లా అభివృద్ధి చెందాలంటే అన్ని దిక్కులా కార్యాలయాలు ఏర్పాటైతే బాగుంటుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కేటాయించిన స్థలం గద్వాల జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతోపాటు జములమ్మ ఉత్సవాల సమయంలో నాలుగు నెలల పాటు రాకపోకలకు అడ్డంకులు కలుగుతాయని దీంతో కక్షిదారులతోపాటు అధికారులు, న్యాయవాదులు ఇబ్బందులు పడతారని అక్కడ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టకుండా పీజేపీ క్యాంప్ ఆవరణలో మిగిలి ఉన్న స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా న్యాయవాదులు విధులు బహిష్కరించి రిలే దీక్షలు చేపట్టారు.
జిల్లా ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి 2025 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల నిర్మాణాలకు ఒకే సారి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. అయితే గద్వాల బార్అసోసియేషన్ న్యాయవాదుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాల కారణంగా శంకుస్థాపన నిలిచి పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ శంకుస్థాపన కార్యక్రమం నిలిచి పోతే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి వచ్చిన నిధులు వెనక్కి పోయే ప్రమాదం ఉన్నది. ఏది ఏమైనా న్యాయవాదులు అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అటు కక్షిదారులకు, న్యాయవాదులకు, అధికారులకు అందరికీ అనుకూలంగా, ఆమోదయోగ్యంగా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకుంటే అన్ని వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా మేధావులైనా న్యాయవాదులు ఆలోచించాల్సిన అవసరంతోపాటు జిల్లా అభివృద్ధికి వారి సలహాలు, సూచనలు ఎంతైనా అవసరం.