అలంపూర్, నవంబర్ 9 : విధి నిర్వహణలో భాగంగా ఇదివరకు చాలా మంది న్యాయవాదులు దాడులు జరిగాయని, అంతే కాక కొన్ని ప్రాంతాల్లో దుండగుల చేతుల్లో ప్రాణాలు కూడా కోల్పోయారని, న్యాయవాదుల రక్షణ కోసం వారి కుటుంబాల పరి రక్షణకోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడు హన్మంతురెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అలంపూర్ క్షేత్రంలో ఆదివారం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకున్న అనంతరం వారు న్యాయవాదుల చలో హైదరాబాద్ పాదయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, నారాయణరెడ్డి, న్యాయవాదులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం అలంపూర్ జోగుళాంబ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపడుతున్నట్టు వివరించారు. అలంపూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపడుతున్న చలో హైదరాబాద్ మహా పాద యాత్రకు పలు జిల్లాల నుంచి న్యాయవాదులు మద్దతు తెలిపారు. నవంబర్ 9వ తేదీన అలంపూర్‌లో ప్రారంభమైన యాత్ర శనివారం వరకు హైదరాబాద్ చేరుకుంటుందన్నారు. సీనియర్ తిరువీదుల నారాయణరెడ్డి అడ్వకేట్ మాట్లాడుతూ ముఖ్యంగా 41 చట్టాన్ని సవరించాలని, జూనియర్ న్యాయవాదులకు నెలసరి గౌరవ వేతనంగా పది వేల రూపాయలు ఇవ్వాలని, న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను అరికట్టి కఠినమైన చట్టాలను అమలు చేసి న్యాయవాదులకు, వారి కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
సమస్యలను పాదయాత్ర రూపంలో వ్యక్తపరుస్తు ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర సంఘం దృష్టికి, హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకుపోనున్నట్టు వారు వివరించారు. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా హైదరాబాద్ న్యాయవాదులు ఇతర జిల్లా న్యాయవాదులు పాదయాత్రకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం అలంపూర్ నుంచి బయలు దేరిన పాదయాత్ర ఉండవెల్లి మండలం మీదుగా నడుచుకుంటూ రాత్రి మానవపాడు మండలానికి చేరుకున్నది. కార్యక్రమంలో అలంపూరు బార్ అసోసియేషన్ సభ్యులు శ్రీధర్‌రెడ్డి, నాగరాజుయాదవ్, క్యాతూరు నర్సింహ, గజేంద్రగౌడ్, మధు, ఆంజనేయులు, వేణుగోపాలస్వామి, రవికుమార్, వెంకటేశ్, యాకూబ్, హేమంత్‌యాదవ్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.