అచ్చంపేట/అమ్రాబాద్, మే 15 : అచ్చంపేట నియోజకవర్గంలో మంగళవారం గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి శ్రీశైలం బయల్దేరారు. మార్గమధ్యంలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్లోని అటవీశాఖ అతిథిగృహానికి మంత్రి చేరుకోగా, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం మన్ననూర్‌కు చేరుకోనున్నారు.
మన్ననూర్‌లో నూతనంగా నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్సెంటర్, చెంచులక్ష్మీ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్చంపేట మండలం చెంచుపలుగుతాండ, శంకరయ్యగుట్టతండా, నక్కెర్లపెంటతండా, గోపాల్రావునగర్తండాలకు బీటిరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అచ్చంపేట షామ్స్ ఫంక్షన్హాల్లో వివిధ పథకాల నుంచి మంజూరైన యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అలాగే ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు బ్యూటీపార్లర్ శిక్షణాకేంద్రాన్ని ప్రారంభించనున్నా రు. మంత్రి పర్యటన సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.