మహబూబ్నగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కోస్గి : లగచర్ల, రోటిబండతండా, పులిచర్ల తండా, హకీంపేట, పోలేపల్లి వాసుల్లో భ యం నెలకొన్నది. ఫార్మా సిటీకి ఎట్టి పరిస్థితుల్లో త మ భూములు ఇచ్చేది లేదన్న వారిపై సర్కారు కర్కశత్వం, పోలీసుల దాడులు జరుగుతుండడంతో బి క్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వారం కిందట కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి.. అనంతరం జరుగుతున్న పరిణామాలు తండాలను భయం గుప్పిట్లో కి నెట్టేశాయి.
పది నెలలుగా కనీస సమాచారం ఇవ్వకుండా.. అధికార యంత్రాంగం ఫార్మా కంపెనీల కో సం భూసేకరణ చేపట్టడం వివాదాస్పదంగా మారుతున్నది. గిరిజనుల ఆందోళనలు పక్కకు పెట్టి బలవంతంగా భూసేకరణ చేపట్టడంతో దాడికి కారణమైంది. ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లాలోని శాం తిభద్రతలు అదుపు తప్పాయి. ఫలితంగా పోలీసు వ్యవస్థ రాజ్యమేలుతోంది. రాత్రిళ్లు తండాల మీద ప డి అనుమానితుల కోసం ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ ఐదు గ్రామాలు పోలీసుల పహారాలో ఉన్నాయి. చా లామంది భయంతో పారిపోగా, మరికొందరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇంకొందరు ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొన్నది.
లగచర్ల గిరిజనులపై జరిగిన అమానుష ఘటనను విచారించేందుకు సోమవారం జాతీయ ఎస్టీ కమిష న్ బృందం పర్యటించింది. ఈ పర్యటన కూడా పోలీ సు పహారాలో కొనసాగడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు దాడి వెనుక బయట వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే పో లీసులు తండాల జోలికి వెళ్లొద్దని.. అనుమానిస్తున్న వారిని వెంటనే విడుదల చేయాలని కమిషన్ బృం దం ఆదేశించింది. గిరిజనులపై అమానుషాన్ని ఆపకపోతే బాధ్యులందరినీ సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. డీజీ పీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా నివేదిక కోరతానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జలోతు హుస్సేన్ వెల్లడించారు.
సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంలో పోలీసు ల తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ బృందం మండిపడింది. ఏకపక్షంగా సాగుతున్న భూసేకరణ ఏమిటని నిలదీసింది. కొన్ని నెలలుగా ఫార్మా కంపెనీ వస్తుందని ప్రచారం జరుగుతుండగా, అసలు ఇక్కడికి వస్తున్నది.. ఫార్మా కంపెనీయా? లేక ఇతర కంపెనీలా? అనేది స్పష్టత ఇవ్వడం లేదని గుర్తించింది. గిరిజను లు తమ భూములు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. పాదయాత్రలు చేశారు.. ఆందోళనలు నిర్వహించారు.. నిరాహార దీక్షలు చేపట్టారు. అయినా ప్ర భుత్వాధికారులు ఇవేవీ పట్టించుకోకుండా భూసేకరణకు ముందుకు వెళ్లడంపై కమిషన్ బృందం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. తమ భూములు ఇవ్వమని తెగేసి చెప్పిన వారికి నచ్చజెప్పేదిపోయి రాజకీయాల కోసం పరితపిస్తారా? అంటూ అధికారులను నిలదీసింది. ఇంతకు ఎలాంటి కంపెనీలు పెడుతున్నారు.. ప్రజలకు ఎందుకు తెలియజేయడం లేదంటూ.. అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేసింది.
కలెక్టర్ ఇతర అధికారులపై దాడి ఘటన వెనుక ఇతరుల ప్రమేయం ఉండొచ్చని జాతీయ ఎస్టీ కమిషన్ బృందం అభిప్రాయపడింది. అమాయకులైన గిరిజనులను ఇందులో ఇరికించడానికి కొంతమంది రాజకీయ నేతలు పన్నాగం చేసి ఉండొచ్చని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనను అడ్డం పెట్టుకొని పోలీసులు తమ ప్రతాపం చూపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గ్రామాల్లో, తండాల్లో మనుషులే కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్లారు..? ఉన్నా రా? పారిపోయారా? అంటూ ప్రశ్నించారు. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ఇవాల్టి నుంచి ఒక్క పోలీసు కూడా తండాల్లో కనపడవద్దని కమిషన్ బృందం హెచ్చరించింది. అక్కడే ఉన్న వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డిని పిలిచి జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి పోలీసులెవరూ తండాల జోలికి వెళ్లవద్దని, ఎక్కడ కూడా పోలీస్ పికెట్లు పెట్టొద్దంటూ ఆదేశాలిచ్చింది.
‘మేము ఓట్లు వేసింది తిరుపతిరెడ్డికా, రేవంత్రెడ్డి కా.. మా ఓట్లతోనే రేవంత్ సీఎం అయ్యావు.. ఒక్కసారైనా మా తండాలకు వచ్చావా..? మాతో మాట్లాడిన వా? అంటూ గిరిజన మహిళలు, కమిషన్ బృందం ఎదుట వాపోయారు. 200 మంది పోలీసులతో తిరుపతిరెడ్డి మా తండాలకు వచ్చి భూములు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తా.. అంటూ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయాలని, జైల్లల్లో ఉన్న తమ వారిని వెంటనే విడిపించాలన్నారు. మేం సచ్చినా మా భూములు ఇవ్వమని తేల్చిచెప్పారు. జాతీయ ఎస్టీ కమిషన్ బృందం వెంట ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డితోపాటు దాదాపు 200 మంది పోలీసులు రావడం తండావాసులను మరింత భయాందోళనలను గురిచేసింది.
జాతీయ ఎస్టీ కమిషన్ బృందం లగచర్ల పర్యటన ఉద్విగ్నభరితంగా సాగింది. మధ్యాహ్నం రోటిబండతండాకు చేరుకున్న బృందానికి మహిళలు కాళ్ల, వేళ్ల పడుతూ తమను కాపాడాలం టూ వేడుకోవడం కనిపించింది. వారందరినీ అ క్కున చేర్చుకుంటూ మీ కోసమే నేను వచ్చానం టూ బృందం సభ్యులు భరోసా కల్పించారు. త మ భర్త, పిల్లలను అన్యాయంగా తీసుకెళ్లారని, ఇంకొందరు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, ముసలోళ్లను పట్టుకొని రాత్రిపూట పొలాల్లో పడుకుంటున్నామని వివరించారు. రాత్రయితే చాలు పోలీసులు తమ గ్రామానికి వచ్చి వేధిస్తున్నారని వా పోయారు. ఊర్లళ్లో ఆడోళ్లే మిగిలిండ్రు.. మా ఆ డ పోలీసులను తీసుకొచ్చి మీ సంగతి చెబుతామంటూ బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో చలించిన కమిషన్ బృందం పో లీసులను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇకపై తండాల జోలికొస్తే బాగుండదని, ఎవరైనా పోలీసులు వస్తే తనకు ఫోన్ చేయాలని కమిషన్ స భ్యుడి ఫోన్నెంబర్ ఇచ్చారు. ఇకముందు ఇ బ్బందులు రావని భరోసా కల్పించారు.