నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 18 : సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా నాగర్‌కర్నూల్‌లో రైతు కష్టాలు అన్నీఇన్నీ కావు. పంట సాగు నుంచి మొదలు కోతకు వచ్చే వరకు రైతుకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. నాడు పంట ఎదగడానికి వాడే యూరియాను అందించలేని ప్రభుత్వం నేడు పండించిన పంటలను సైతం కొనుగోలు చేయడంలోనూ విఫలమైంది. దీంతో రైతులకు వ్యవసాయ మార్కెట్ల లోనూ, కొనుగోలు కేంద్రాల్లోనూ జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మక్కజొన్నల కొనుగోలు విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తుందని రైతులు మండిపడుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం మొక్కజొన్న రైతులు మరోసారి రోడెక్కారు. వారం రోజులుగా తాము మార్కెట్‌కు ధాన్యం తీసుకువచ్చినా కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు తరలించకపోవడంతో విసిగివేసారిన రైతులు మరోసారి ఆగ్రహావేశాలకు గురై ఆందోళన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్‌కు అరకిలో మీటర్ దూరంలో ఉన్న శ్రీశైలం-నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారిపై నెల్లికొండ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు పూనుకున్నారు. ముళ్ల కంచెను రోడ్డుకు అడ్డంగా వేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
అరగంటపాటు జరిగిన రాస్తారోకోతో అటు అచ్చంపేట, శ్రీశైలం, కొల్లాపూర్, కల్వకుర్తికి, ఇటు మహబూబ్‌నగర్, హైదరాబాద్, వనపర్తికి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై గోవర్ధన్‌లు పోలీసులతో ధర్నా ప్రాంతానికి చేరుకొని రైతులను బలవంతంగా అక్కడినుంచి మార్కెట్‌కు తీసుకెళ్లారు. దాదాపు 20మంది పోలీసులను మార్కెట్లో పహారా పెట్టారు. రైతుల ఆందోళన ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన చెందిన అధికారులు ముందస్తుగా ఫైర్ ఇంజన్ వాహనాన్ని మార్కెట్లో ఉంచారు. ఈక్రమంలో ప్రభుత్వానికి, అధికారుల తీరుపై రైతులు మండిపడుతూ నినాదాలు చేశారు. వారం రోజులుగా మార్కెట్ తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నా రని, దీంతో తమ కడుపు మండి రోడ్డెక్కాల్సి వచ్చిందని పలువురు రైతులు పోలీసులకు వివరిస్తున్నా అవేవీ పట్టించుకోకుండా వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.
ఆరబెట్టిన ధాన్యానికి గన్నీ బ్యాగులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, కొనుగోలు చేసి కాంటా వేసిన ధాన్యాన్ని సైతం మార్కెట్ నుంచి గోదాంలకు తరలించాల్సి ఉండగా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. దీంతో వచ్చిన ధాన్యం వచ్చినట్లుగానే మా ర్కెట్లోకి తరలించడంతో కుప్పలు తెప్పలుగా ధాన్యం నిండుకుంది. వచ్చిన ధాన్యం వచ్చినట్లుగా కొనుగోలు చేసి, కాంటా చేసిన ధాన్యం గోదాంలకు తరలించాల్సిన మార్కెట్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యాన్ని మార్కెట్ నుంచి గోదాంలకు తరలించకుండా నిర్లక్ష్యం చేస్తూ, తీరా స్థలం లేదంటూ ఈనెల 23వ తేదీ వరకు మొక్కజొన్నను తీసుకురావద్దంటూ మార్కెట్ చైర్మన్ పేరున ఏకంగా గేటుకే నోటీస్ బోర్డు పెట్టడం అంటే రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం బయటపడుతుంది. కొనుగోలు చేసిన ధాన్యం వద్ద రైతు నుంచి వేలుముద్రలు వేయించుకోకుండా వారినే కాపలాగా ఉంచడంతో పలువురు రైతులు మండిపడుతున్నారు. దీంతో చేసేది లేక చాలా మంది రైతులు తమ ధాన్యం మార్కెట్ నుంచి తరలిపోయే వరకు తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని అక్కడే ఉండిపోతున్నారు. నాగర్‌కర్నూల్‌తోపాటు బిజినేపల్లి, తెలకపల్లి, తిమ్మాజిపేట మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక మొత్తంలో మొక్కజొన్న పంటను పండించిన మండలాల్లో సైతం ఒకే కొనుగోలు కేంద్రాన్ని ఆర్భాటంగా ఏర్పాటు చేసిన అధికారులు సౌకర్యాలు కల్పించకపోవడతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
మార్కెట్లకు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడతో కడుపు మండి ధర్నాలు చేస్తే పోలీసులు చెదరగొడుతూ తమ సమస్యలను చెప్పుకునే వీలు లేకుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలా మండలాల్లో కోతకు వచ్చిన పంట పంట పొలాల్లోనే ఉండిపోయిందని, ఇక్కడి మార్కెట్లలో పరిస్థితులను చూస్తే ధాన్యం తేవాలన్న ఆలోచన రావడం లేదని కొందరు రైతులు పేర్కొంటున్నారు. పరిస్థితులు ఇలాంగే ఉంటే జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. అవసరమైన కొనుగోలు కేంద్రాలను పెంచి మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న మక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో అరకొరగా గన్నీ బ్యాగులు పంపిణీ చేయడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్ని ఎకరాలు పంట సాగు చేశారు, ఎంత దిగుబడి వస్తుంది, ఎలా కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలకు ఏ విధంగా తరలించాలన్న ముందస్తు ప్రణాళిక చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదివరకే కొనుగోలు చేసిన మక్కలను మూడు రోజల కిందట ధర్నా రోజు మూడు లారీలు, మరుసటి రోజు రెండు లారీలు మాత్రమే మార్కెట్ నుంచి తరలించారని, ఇంకా దాదాపు 50 లారీల మొక్కజొన్న ధాన్యం మార్కెట్లోనే ఉండిపోయింది.
లారీల కొరత సాకు చూపుతూ ధాన్యాన్ని తరలించకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అద్దె వాహనాల్లో ధాన్యాన్ని తెచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి తమ వచ్చే వాహనాలను ఉంచుకుంటే అద్దె చెల్లించలేక, మార్కెట్లో ధాన్యం పోసుకునేందుకు స్థలం లేక పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నుంచి రోజుకు రెండు మూడు లారీలు మాత్రమే గోదాంకు తరలిస్తుండగా, ఐదు నుంచి పది లారీల మొక్కజొన్నలు మార్కెట్‌కు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు వస్తే పూర్తిస్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.