దేవరకద్ర రూరల్ (చిన్నచింతకుంట), నవంబర్ 8 : అప్పంపల్లి నుంచి అమ్మాపూర్ వరకు జన జాతరే.. ఊకచెట్టు వాగు భక్తజనసంద్రమైంది.. దారిపొడవునా కురుమూర్తి రాయుడి పాదుకలు (ఉద్దాలు) తాకి భక్తు లు పరవశించిపోయారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. శుక్రవారం సాయంత్రం కురుమూర్తి ఉద్దాల వేడుక అంగరంగ వైభవంగా సాగింది. ఏడుకొండలు అ ఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి నామస్మరణతో మార్మోగాయి. పల్లమర్రిలో చాటకు ముందుగా ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పూజలు చేయగా.. అక్కడి నుంచి భక్తుల సందడి.. మేళతాళాల మధ్య ఊరేగింపుగా చిన్న వడ్డెమాన్‌లోని ఉద్దాల మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆచారం ప్రకారం వంశ పారంపరంగా ఉద్దాలు తయారు చేసిన స్థానిక దళిత సోదరులతో కలిసి ఎమ్మెల్యేలు జీఎమ్మార్, వాకిటి శ్రీహరి, ఆలయ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మదనేశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే సీతాదయాకర్‌రెడ్డి, నెల్లి వంశస్తులతో కలిసి పూజలు చేశారు.
అక్కడి నుంచి ఉద్దాల ఊరేగింపు అంగరంగ వై భవంగా సాగింది. ముత్యాల పల్లకీలో దళిత పూజారులు ఉద్దాలు తీసుకురాగా.. భక్తులు దర్శించుకొని పునీతులయ్యారు. వివిధ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఉద్దాలకు పూజలు చేశారు. వాగులో నుంచి తరలిస్తుండగా భక్తులు చాట కింద దూరి మొక్కులు తీర్చుకున్నారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌పై అప్పంపల్లి, తిరుమలాపూర్ మీదు గా కురుమూర్తి స్వామి ఆలయ వద్ద ఉన్న మండపం వద్దకు చేరింది. ఆలయం వ ద్ద ట్రాక్టర్‌పై ఊరేగింపుగా తీసుకొచ్చి ఉద్దాల మైదానం లో ప్రదక్షిణలు చేసిన అనంతరం ఉద్దాలను స్వామి గర్భగుడి ఎదుట పూజలు చేశాక మంటపం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో పటాకుల మోత మార్మోగింది. వేడుకను చూడడానికి దాదాపు రెండు ల క్షల మంది భక్తులు తరలివచ్చారు. మహిళలు నియమ నిష్టలతో వంటలు వండి స్వామికి దాసంగాలు చేసి నైవేద్యాలు సమర్పించారు.
నిరంతరం పర్యవేక్షణ
ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలకు జరగకుం డా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆలయ పాలక మండలి సభ్యులు ఏ ర్పాట్లను పరిశీలించారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేశా రు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూశారు. ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టారు. పుష్కరిణీలో స్నానాలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నారు.
రెండు లక్షల మంది రాక..
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవానికి దాదాపు 2 లక్షలకుపైగానే జనం హాజరయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉద్దాల రోజు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. దీంతో మోటర్ సైకిల్స్, ఆటోలు, కార్లు, జీపులు, ఎడ్ల బండ్లు, బస్సులు, గూడ్స్ వాహనాలు.. ఇలా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు సప్తగిరులకు చేరారు. ఇసుకేస్తే రాలనంత జనం రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులు ఉదయం 7 గంటల నుంచే స్వామిని దర్శించుకునేందుకు బారులుదీరారు. కురుమూర్తి రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ నుంచి గుట్టపై ఉన్న కాంచన గుహలోని స్వామి దర్శనం వరకు భారీ క్యూలైన్ ఏర్పాటు చేశారు.