దేవరకద్ర రూరల్, అక్టోబర్ 29 : సీసీకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని సప్తగిరులలో కొలువైన వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం కురుమతిరాయుడిని గజవాహనంపై ఊరేగించారు. ఈ వేడుక మేళతాళాలు, భక్తజన సం దోహం మధ్య జరిగింది. ఆదివారం ఉత్సవాల్లో రెండో ప్రధాన ఘట్టమైన స్వర్ణాభరణాలు అలంకర చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామి దర్శనంతో పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణ మార్మోగింది. కార్యక్రమంలో కార్యనిర్వాహణ అధికారి శ్యాంసుందరాచారి, చింతకుంట నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అలంకార మహోత్సవానికి ఆత్మకూరు పట్టణం ముస్తాబైంది. ఆత్మకూరు ఎస్బీఐలో ఉన్న స్వర్ణాభరణాలను ఊరేగింపుగా స్వామి చెంతకు చేర్చనున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకు నుంచి చెరువుకట్టపై వరకు సాగే ఊరేగింపును వైభవంగా నిర్వహించేందుకు చైర్పర్సన్ నేతృత్వంలో పాలకమండలి సన్నద్ధమైంది. భక్తులు తిలకించేలా భారీ డిజిటల్ స్క్రీ న్లను ఏర్పాటు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎస్పీల నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఊరేగింపు పొడవునా ప్రత్యేక బలగాలతో బందోబస్తు, స్వర్ణాభరణాల కాన్వాయ్‌కు ప్రత్యేక ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. బ్యాంకు అధికారులు సైతం ఆదివారమైనా సహకారం అందిస్తున్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌రెడ్డి దంపతులు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్లు స్వర్ణసుధాకర్‌రెడ్డి, లోకనాథ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. సీఐ కేఎస్త్న్రం, ఎస్సై మహేశ్‌గౌడ్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.