నాగర్‌కర్నూల్, మే 19 : ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకంపై రేవంత్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ పోరుబాట పట్టడానికి సమాయత్తం కావడంతో రేవంత్‌రెడ్డి సర్కార్ మొద్దు నిద్ర లేచిందని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పోరుబాట పేరుతో పాదయాత్ర చేయాలన్న నిర్ణయంతో మొద్దు నిద్రలేచిన రేవంత్ సర్కార్ రెండున్నరేండ్ల తర్వాత సమీక్షకు పూనుకుందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే 90శాతం ప్రాజెక్టు పనులు పూర్తవ్వగా మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేండ్ల కాలం వెళ్లదీశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్ల క్ష్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని, ప్రాజెక్టు పనులు మిగిలిన 10శాతం పూర్తిచేస్తే ఆ క్రెడిట్ అంతా కేసీఆర్‌కు దక్కుతుందన్న అక్కసుతో ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకుపోవడం లేదని మర్రి విమర్శించారు. కాల్వల టెండర్లను రద్దు చేయడం, తట్టెడు మట్టి ఎత్తకపోవడంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీస్తున్న తరుణంలో సమీక్షల పేరుతో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్‌రెడ్డి ఒక్క రోజు పాలమూరు ప్రాజెక్టులపై సమీక్ష చేయలేదని, సొంత జిల్లాలోని ప్రాజెక్టులను ప్రజలను పట్టించుకోకుండా సీఎంగా రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డల ముందుకు ఏముఖంతో వస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌పై కక్షతో రైతులను మోసం చేయొద్దని, పాలమూరుకు అన్యాయం చేయవద్దని రేవంత్ సర్కారుకు సూచించారు. ఇప్పటికే పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది నార్లాపూర్తోపాటు ఏదుల, వట్టెం, కర్వెనలో 45 టీఎంసీల వరకు నీటిని నింపుకొనే అవకాశం ఉండేదని, కృష్టానదిలో సమృద్ధిగా నీరు ఉన్న రెండున్నరేండ్ల నిర్లక్ష్యం కారణంగా నీటిని వినియోగించుకునే పరిస్థితిలో లేకుండా పోయిందని విమర్శించారు.
రెండున్నరేండ్లుగా ప్రాజెక్టు పనులను పడావు పెట్టడంపై త్వరలో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాలని ఈనెల 15న బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంతో రేవంత్‌రెడ్డి సర్కారులో కదలిక వచ్చిందన్నారు. మహబూబ్‌నగర్‌లో సమావేశమై కార్యాచరణ ప్రకటించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉద్యమానికి సన్న ద్ధం అవుతున్న తరుణంలో మేల్కొనడం జరిగిందన్నారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి కేసీఆర్‌ను తీసుకురావాలని ప్రతిపాదనలు చేయడంతో తమ తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనని సమీక్షకు పూనుకున్నారే తప్పా ప్రాజెక్టును పూర్తి చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. రైతులు, ప్రజలను చైతన్యపరిచి ఉ ద్యమాలు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో ప్రతిఘటనతప్పదని కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా కా ంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష నిర్వహించారని విమర్శించారు. ఈ సమీక్ష మొక్కుబడిగా అన్న విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కేఎల్ఐ మోటర్లను బాగు చేయించాలి
కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటార్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని మర్రి డిమాండ్ చేశారు. మొత్తం ఐదు మోటర్లు నడిచేలా చర్యలు చేపట్టాలని కోరారు. నార్లాపూర్-ఏదుల-వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది నీటిని ఎత్తిపోసుకునే రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
బీఆర్ఎస్ పోరుబాట నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, అయినా పనులు చేపట్టే వరకు బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదన్నారు. ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, ప్రాజెక్టు పూర్తి చేసే వరకు తమ ఉద్యమం ఆగదని మర్రి హెచ్చరించారు.