వనపర్తి, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఇక్కడ లేకున్నా.. నదీ పరీవాహక ప్రాంతంలో ఇతర రాష్ర్టాల్లో పడిన వానలకు కృ ష్ణానదికి వరద పోటెత్తుతున్నది. అంచెలంచెలుగా పెరుగుతున్న వరద ప్రవాహంతో జూరాలకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణాపూర్ డ్యాంల నీటి మట్టం ఇంతకింతకు పెరడంతో రైతన్నలు సంబుర పడ్డారు. అనుకున్నట్లుగానే జూరాలను సహితం మూడ్రోజుల కిందటే కృష్ణమ్మ ముద్దాడింది. దీంతో రైతులకు ఎక్కడాలేని ఆనందం వచ్చినైట్లెంది. అయితే.. ఇప్పటి వరకు కాల్వలకు సాగునీటి జా డే లేకపోవడం.. మంత్రులు, ఎమ్మెల్యేలు ‘ఎవరికి వారు యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు ఆలోచనలో పడ్డారు. సీఎం సొంత జిల్లా అంటూ ఢంకా భజాయింపు తప్పా కర్షకుల కష్టాలపై ఆలోచించేవారు ఎక్కడున్నారన్న ప్రశ్నలు రైతు ల నుంచి తలెత్తుతున్నాయి. విద్యుత్ ఉ త్పత్తితో దిగువకు విడుదల చేస్తున్నా ప్రభుత్వానికి ఉమ్మడి పాలమూరు రైతులు ఏం పాపం చేశారని.. సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఆల్మట్టి నుంచి అవుట్‌ఫ్లో ఆశాజనకంగా ఉన్నప్పటికీ జూరాల ప్రాజెక్టు కింద ప్రధాన కాల్వలు వెలవెలబోతున్నాయి. డ్యాంకు వరద తాకిడి మొదలు కాగానే కాల్వలకు సాగునీటి విడుదల జరుగుతుందని రైతులు భావించారు. అయితే.. మూడ్రోజులుగా వరద ప్రవహిస్తున్నా.. కాల్వలకు చుక్క నీరు విడుదల చేయకపోవడంపై ఆగ్రహంతో వ్యక్తమవుతోంది. ఎలాగు వర్షాలు రావని తెలుసు.. కనీసం వచ్చిన జలాలను ఒడిసి పట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మీనామేషాలు లెక్కిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. నెలరోజుల కిందటే నారుమడులు సిద్ధం చేసుకుని ఎదురు చూస్తున్న కర్షకులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక నిరుత్సాహంలో పడ్డారు. కాల్వలకు నీళ్లెప్పుడు వస్తాయా? అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జూరాల కుడి, ఎడమ కాల్వలు నీళ్లులేక బోసిపోతున్నాయి.
జూరాల ఎగువన కర్ణాటకలో కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల కింద జలకళ ఉట్టి పడుతుంది. పక్షం రోజులుగా నీటి ప్రవాహాన్ని చూసినా రైతులు సంబురంగా సేద్యం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం దేశమంతా ఉందని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. ఏ ప్రాజెక్టు పరిధిలో కూడా సాగు లేకుండా వదిలేయలేదు. వర్షాల ప్రభావాన్ని బట్టి వ్యవహరిస్తున్నారు. జూరాలకు వరద రానంత వరకు ఇక్కడి రైతులు కూడా ఆశలు వదులుకున్నారు. అయితే, కృష్ణమ్మ ఉరకలు వేయడంతో కర్షకుల్లో ఆనందం కనిపిస్తుంది. కానీ పీజేపీకి వరద మొ దలైనా.. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎడమొఖం.. పెడమొఖంగానే ఉన్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులపై ఎప్పుడు పాజిటివ్‌గా పాలకులు ఆలోచించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వరద నీటితో జూరాల ప్రాజెక్టుపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలన్నిటికీ నీరందిస్తే.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలు సాగు చేసుకోవచ్చని రైతు లు భావిస్తున్నారు.. కానీ పాలకులు సాగునీటి విడుదల విషయంలో మల్లగుల్లాలు పడుతుండడంపై మండిపడుతున్నారు.
జూరాలకు వరద ప్రవాహం వచ్చినప్పటికీ మంత్రు లు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని భావించిన రైతులు సొంత ప్రయత్నాలు చేయాలనే ఆలోచనలో పడ్డారు. రైతులంతా కలిసి జూరాల ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మూడ్రోజులుగా జరుగుతున్న ఈ చర్చ మరింత వేడిగా తెరపైకి వస్తోంది. ఎటు తిరిగి జూరాల కింద సాగు లేకుండా చూడాలన్న తరహాలోనే ప్రభుత్వ ఆలోచన ఉందని, దీనిపై రైతులు స్వయంగా కదిలితే తప్పా కాల్వలకు నీటి విడుదల జరగదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కృష్ణానదికి వస్తున్న వరదను ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముందు వ్యవసాయానికి ప్రాధాన్యనివ్వాలి. ఇక్కడి రైతుల ప్రయోజనాలు పక్కకు పెట్టడం సరైంది కాదు. జూరాలపై ఆధారపడ్డ రిజర్వాయర్లు, చెరువులు తక్షణమే నింపాలి. ఉమ్మడి వీపనగండ్ల మండలంలోని అన్ని గ్రామాలకు గోపల్‌దిన్నె రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలి. ప్రభుత్వం దిగువకు నీటిని విడుదల చేయడం వల్ల పాలమూరు రైతాంగం తీవ్ర నష్టం జరుగుతుంది.
జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్నందునా కాల్వకు సాగునీరు విడుదల చేయాలి. ఇప్పటికే రైతులు వరినార్లు సిద్ధం చేసుకు న్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నందునా వెంటనే కాల్వలకు నీటి విడుదల చేసి, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపాలి. ఇలా చేయడం వల్ల వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండదు. ఇక్కడ ఉన్న నీటి వనరులను ఖాళీగా పెట్టి విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు నీటి విడుదల చేయడం సరైంది కాదు. వరద వస్తున్నందునా సాగుకు నీటిని అందించాలి.
జూరాలకు దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిదిలో తాగునీటికి ఇబ్బందులున్న దృష్ట్యా ప్రస్తుతం జూరాల కాల్వలకు నీటి విడుదల చేయడం సాధ్యం కాదు. ఎల్‌నినో ప్రభావం పరిస్తితులున్నందునా.. తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటాం. కాల్వలకు నీటి విడుదల జరిగితే రైతులంతా నాట్లు వేసుకుంటారు. తర్వాత నీరు రాకుంటే తాగునీటికి ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.