దుండిగల్, ఫిబ్రవరి 24: దుండిగల్ గ్రామ రైతులకు ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కాపాడుకుంటమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. గండి మైసమ్మ-దుండిగల్ మండలం, దుండిగల్ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 453, 454లోని చిన్న చెలక భూమిని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురై దుండిగల్‌లోని వార్డు కార్యాలయం ఎదుట సోమవారం సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ రైతులు సాగు చేసుకొనే భూమిలో ప్రభుత్వం బోర్డులు ఏర్పాటు చేయడంపై సంబంధిత అధికారులతో చర్చిస్తామని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా కాపాడుకుంటామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.
50 ఏండ్ల క్రితమే సాగు కోసం నిరుపేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉందని, అయితే సర్వే నంబర్ 453, 454 భూములకు సంబంధించి చట్టపరంగా అందరం కలిసి రక్షించుకుందామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకటై పోరాడదామని అన్నారు. అనంతరం స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
సమస్య తీవ్రతపై తహసీల్దార్‌తో చర్చించారు. సర్వే నంబర్ 453, 454 లలోని భూములకు సంబంధించిన వివరాలు సేకరించి ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఎమ్మారోకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే వివేకానంద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల పక్షాన పోరాడిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శంబీపూర్ కృష్ణ, జక్కుల కృష్ణ యాదవ్, అమరం గోపాల్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
సర్వమత సారమే మానవ జీవన విధానమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ విప్ , కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న మజీద్ ఈ మహబూబున్నీసా బేగం-మెహబూబా అక్తరీ మసీదుకు ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ శంబీపూర్ కృష్ణ, మైనార్టీ విభాగం నాయకులు మహమ్మద్ అలీ నాయర్, రహత్ అలీ, మహమ్మద్ నసీరుద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు