గద్వాల, ఫిబ్రవరి 20: ఆ గ్రామానికి వెళ్తే కొండంత అభివృద్ధి కనిపిస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల కంటే ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి ప్రజల సహకారంతో అక్కడి సర్పంచ్ కృషి చేస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రంతోపాటు దేశం అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి బాట పడ్డాయి. అందుకు నిదర్శనమే మండలంలోని కొండపల్లి గ్రామం. గ్రామ పంచాయతీ భవనంలో కంప్యూటర్ ఏర్పాటు చేసి గ్రామ సమాచారం అందులో నిక్షిప్తం చేస్తున్నారు. ఒకప్పుడు గ్రామంలోకి అడుగుపెడితే రోడ్లపై మురుగు, బస్టాండ్ ఆవరణలో చెత్త చెదారంతో నిండిపోయి ఉండేది. ప్రస్తుతం ఎవరైనా గ్రామానికి వస్తే ఇది మా గ్రామమేనా అని ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేశారు. కొన్ని కాలనీల్లో సీసీ ఏర్పాటు చేస్తే గ్రామం మొత్తం సీసీరోడ్లతో నిండి ఉంటుంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గ్రామస్తుల సహకారంతో సర్పంచ్ మహేశ్వరమ్మ గ్రామం అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నది.
ఆహ్లాదరకర వాతావరణంలో..
గ్రామంలోకి అడుగు పెట్టగానే పల్లె ప్రకృతివనం కనిపిస్తుంది. అందులో రకరకాల మొక్కలతోపాటు వాకింగ్‌ట్రాక్ ఏర్పాటు చేశారు. అక్కడే కాడెద్దులు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ కాడెద్దులను గెడం తోలే విధంగా ఆకృతి ఏర్పాటు చేశారు. గ్రామానికి వెళ్లగానే ముందుగా ఆకట్టుకుంటుంది. దీంతోపాటు అదే ప్రాంతంలో వైకుంఠధామం ఏర్పాటు చేశారు. అలాగే వైకుంఠధామంలో శివుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. అక్కడే రైతువేదిక ఏర్పాటు చేశారు. రైతువేదికకు చుట్టుపక్కలా పచ్చనిగడ్డి నాటడంతో ప్రాంగణమంతా మొక్కలతోపాటు ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. గ్రామంలో అభివృద్ధి పనులు
సుమారు రూ.కోటితో అభివృద్ధి పనులు చేపట్టారు. బస్టాండ్ ఆవరణలో రూ.5లక్షలతో డ్రైనేజీ, సీసీరోడ్డు ఏర్పాటు చేశారు. రూ.1.85లక్షలతో 12సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామంలోకి ఎవరొస్తున్నారు.. వెళ్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించి వీడియోలు చూడడానికి పంచాయతీ భవనంలో టీవీ ఏర్పాటు చేసి అక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో 3,125మంది జనాభా ఉండగా 2,200మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఇంటి వద్ద మరుగుదొడ్డి నిర్మాణంతోపాటు మిషన్‌భగీరథ కుళాయి, ఇంకుడు గుంతలు నిర్మించారు. నల్లా నుంచి నీరు రోడ్లపై రాకుండా ఇంకుడుగుంతలోకి వెళ్లి నీరు ఇంకిపోయేలా సీసీ వేసి నీరు కిందికి వదులుతున్నారు. దీనికితోడు గ్రామంలో సుమారు 120ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇక రూ.50లక్షలు ఖర్చు చేసి సీసీరోడ్లు ఏర్పాటు చేస్తే ఊరు మొత్తం సీసీరోడ్లు ఏర్పాటైనట్లే. పారిశుధ్య పనులు చేపట్టడానికి ఎనిమిది మంది కార్మికులను నియమించుకున్నారు. నిత్యం చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్ ఏర్పాటు చేశారు. హరితహారం మొక్కలకు నీళ్లు పట్టేందుకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లుపోసి సంరక్షిస్తున్నారు.
ఇంత అభివృద్ధి చూడలేదు
గ్రామంలో ఇంత అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన కృషి వల్ల మా గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, రైతువేదిక ఒకేచోట ఏర్పాటు చేయడంతో గ్రామ రూపురేఖలు మారాయి. గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు మా గ్రామం రుణపడి ఉంటుంది. – వెంకటన్న, గ్రామస్తుడు
ఇంటింటికీ మంచినీళ్లు
గతంలో ఎక్కడపడితే అక్కడ మురుగు నిలిచి రోడ్లపై పారేది. ప్రస్తుతం గ్రామానికి మొత్తంగా పెద్ద డ్రైనేజీ ఏర్పాటు చేయండతో మురుగు అందులోకి పోతుంది. కొన్నిచోట్ల మినహాయిస్తే ఎక్కడ కూడా మురుగు రోడ్లపై పారడం లేదు. గ్రామంలో పట్టణం మాదిరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నారు. పారిశుధ్య కార్మికులను నియమించడంతో చెత్తచెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు.
– కిష్టన్న, గ్రామస్తుడు
గ్రామస్తుల సహకారంతోనే..
గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నానంటే గ్రామస్తుల సహకారంతోనే సాధ్యమైనది. ప్రభుత్వం ప్రతి నెలా గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేస్తుండడంతో ఆ నిధులు ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వాలు గ్రామాలకు నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. సీఎం కేసీఆర్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు విడుదల చేయడంతో గ్రామంలో రైతువేదిక, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, సీసీరోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటికీ మిషన్‌భగీరథ నీటిని అందించడంతోపాటు ఇంకుడుగుంతలు ఏర్పాటు చేశాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతా.
– మహేశ్వరమ్మ, సర్పంచ్, కొండపల్లి