పెబ్బేరు, సెప్టెంబర్ 12 : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారి తెగిపోయింది. శేరిపల్లె సమీపంలో వాగుపై కొత్త వంతెన నిర్మిస్తున్నందున పక్కనే తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటు వంతెన నిర్మాణం మధ్యలో ఆగిపోవడం, అటు తాత్కాలిక రోడ్డు నిర్వహణను పట్టించుకోకపోవడం వల్ల శుక్రవారం నీటి ప్రవాహానికి అది తెగిపోయింది. అదే సమయంలో కొల్లాపూర్ నుంచి పెబ్బేరుకు వస్తున్న ఒక భారీ ట్రక్కు దాంట్లో దిగబడిపోయింది.
దీంతో జేసీబీ సాయంతో నానా తం టాలు పడి దాన్ని పక్కకు తొలగించారు. రోడ్డు తెగిపోయి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతున్నందున వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెబ్బేరు-కొల్లాపూర్ మధ్య ఇది ప్రధాన రహదారి కా వడం, రోజూ వందలాది వాహనాలు తిరుగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాసీల్దార్ మురళి, ఎస్సై యుగంధర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రోడ్డుకు ఇరువైపులా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనాలను శ్రీరంగాపురం మీదుగా మళ్లించారు. నిలిచిపోయిన ఈ రోడ్డు వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు వంతెన వద్ద రాస్తారోకో చేసి ప్రభుత్వ దృష్టికి తెచ్చినప్పటికీ ఇంత వరకు స్పందన లేదు.