Mother Tongue | కొల్లాపూర్, ఫిబ్రవరి 15: మాతృభాషలో విద్యను అభ్యసించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొల్లాపూర్ మండల విద్యాధికారి ఇమ్మానుయేల్ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ తెలుగు సబ్జెక్టు ఫోరం ఆధ్వర్యంలో శనివారం రోజు కొల్లాపూర్లోని జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాలలో, మండల స్థాయి తెలుగు ప్రతిభా పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఇమ్మానియేల్ ప్రశ్నాపత్రాన్ని విడుదల చేసి, పరీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ జ్ఞాన సంపాదనకు ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చుకానీ, మాతృభాషను విస్మరించవద్దని అన్నారు.
తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరం జిల్లా బాధ్యులు, పరీక్షా నిర్వాహకులు వేదార్థం మధుసూదన శర్మ, డాక్టర్ గూడెల్లి శ్రీను మాట్లాడుతూ, కన్నతల్లి వంటి మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ఇతర భాషల మోజులో పడి మాతృభాషను దూరం చేసుకోవద్దన్నారు. స్వేచ్ఛగా మన భావాలను ఇతరులతో వ్యక్తం చేయడానికి మాతృభాషనే ఎంతో ఉపకరిస్తుందన్నారు. తెలుగు ప్రతిభా పరీక్షలో కొల్లాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో చదివే 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
మండల స్థాయి తెలుగు ప్రతిభా పరీక్షలో జిల్లా పరిషత్ గాంధీ స్మారక ఉన్నత పాఠశాల విద్యార్థి వెంకటేష్ ప్రథమ స్థానాన్ని పొందగా, జిల్లా పరిషత్ నార్లాపూర్ పాఠశాల విద్యార్థినులు భారతి, శ్రావణి ద్వితీయ, తృతీయ స్థానాలను పొందారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఖుర్భాన్ అలీ, మల్లికార్జున్, శ్రీదేవి, సుదర్శన్, నిరంజన్, బషీర్, బాలు, గంగన్న తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.