ఊట్కూర్ : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో (Kodangal project) భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జి. వెంకట్రామారెడ్డి( Venkatramreddy) ఆరోపించారు. నిర్వాసితుల సంఘం జిల్లా కమిటీ పిలుపుమేరకు శనివారం ఊట్కూర్ మండల కేంద్రంలో రైతులు తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ( Protest ) తెలిపారు.
స్థానిక మెయిన్ బజార్ నుంచి ప్ల కార్డుల ప్రదర్శనతో ర్యాలీగా వెళ్లిన రైతులను కార్యాలయం మెయిన్ గేట్ బయటనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పోలీసుల నడుమ కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతిఘటించిన రైతులు కార్యాలయం కాంపౌండ్ వాల్ లోపలికి ప్రవేశించి ధర్నా నిర్వహించారు. నెల రోజులుగా భూ నిర్వాసితులు వివిధ రూపాల్లో తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, అధికారులు సైతం తాము నిర్ణయించిన భూ పరిహారం తీసుకోవాలని రైతులను ప్రలోభాలకు గురిజేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సీఎం సొంత నియోజకవర్గం లగచర్ల ఇండస్ట్రీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 20 లక్షల పరిహారంతో పాటు కంపెనీ నుంచి మరో నాలుగు లక్షల పరిహారం, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో మాత్రం మరో రకంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా ప్రాజెక్టు పనులు చేపట్టరాదని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 14 లక్షల పరిహారం రైతులకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
వాస్తవ పరిహార నిర్ధారణ కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు, మేధావులతో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, కమిషన్ నిర్ధారించిన బేసిక్ ధరకు 2013 చట్టాన్ని అన్వయించి భూ పరిహారం అందజేయాలని కోరారు. భూ నిర్వాసితులను ఆదుకునేందుకు మంత్రి వాకిటి శ్రీహరి స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దొబ్బలి హనుమంతు, పీఏసీఎస్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ విండో చైర్మన్ నారాయణ రెడ్డి పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. వివిధ డిమాండ్లతో తహసిల్దార్ రవికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మరాజు గౌడ్, మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, కోరం మహేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, అనీల్ రెడ్డి, రాంరెడ్డి, బాల్ రాజ్, విజయ భాస్కర్ రెడ్డి, వడ్డే పెద్ద హనుమంతు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.