మక్తల్, ఆగస్టు 14 : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించేంత వరకు భూ సేకరణ చేపట్టవద్దని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూము లు కోల్పోతున్న రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ నిలిపివేయడంతోపాటు భూములకు బేసిక్ ధరను నిర్ణయించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి ఆధ్వర్యంలో గురువారం కాట్రేవుపల్లి, ఎర్నగానిపల్లి, కాచ్వార్ గ్రామాలకు చెందిన రైతులు కాచ్వార్ నుంచి మక్తల్‌కు పాదయాత్ర నిర్వహించారు.
అయితే పాదయాత్రకు అనుమతులు లేవని మక్తల్ సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి తమ సిబ్బందితో రెండుగంటలపాటు రైతులను నిర్బంధించారు. అనేక ఆటంకాల మధ్య డీఎస్పీ లింగయ్య అనుమతితో మధ్యాహ్నం 2:30 గంటలకు రైతులు పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రను అడ్డుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కాచ్‌వార్‌కు చేరుకొని రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపారు. అనంతరం వారితో కలిసి ఏడు కిలో మీటర్లు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు మక్తల్ నియోజకవర్గాన్ని ఎండబెట్టి కొడంగల్‌కు నీరు తీసుకుపోతామంటే ఎలా అని ప్రశ్నించారు. ఆ పథకానికి ఇంకా డీపీఆర్ లేదని, ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించి రైతుల వద్ద ఆగమేఘాల మీద భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
మీ నియోజకవర్గంలోని ఫార్మా కంపెనీల కోసం రైతుల ఏ విధమైన పరిహారం ఇచ్చారో మక్తల్ నియోజకవర్గంలోని రైతులకు అదేవిధంగా పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ రైతులకు కొడంగల్ మాదిరి పరిహారం ఎందుకు ఇప్పించడం లేదో బహిర్గతం చేయాలన్నారు.
అనంతరం పాదయాత్రగా బయలు దేరిన రైతులు మక్తల్ తాసీల్దార్ కా ర్యాలయానికి చేరుకొని ఆం దోళన నిర్వహించారు. అనంతరం తాసీల్దార్ చంద్రశేఖర్‌కు వివిధ డిమాండ్లతో కూ డిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర భూ నిర్వాసితుల సంఘం కార్యదర్శి కిల్లె గోపాల్, బీఆర్ఎస్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి, భూ నిర్వాసిత కమిటీ సభ్యులు, నాయకులు అన్వర్ హుస్సేన్, నర్సింహారెడ్డి, తరుణ్, షమీ, సాగర్, రైతులు రాఘవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కేశవులు, శివ తదితరులు పాల్గొన్నారు.