వెల్దండ : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కేస్లీ తండాకు (Kesli Thanda) ప్రభుత్వం ఆర్టీసీ బస్సు (RTC Bus ) సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ ( BRS ) సీనియర్ నాయకుడు కేస్లీ తండా మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్( Laxman Naik) డిమాండ్ చేశారు. శుక్రవారం వెల్దండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏళ్ల తరబడి తమ తండాకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి తలకొండపల్లి మండలం గటిప్పలపల్లి కి అనేక బస్సులు వస్తున్నాయని, తమ తండాకు మాత్రం బస్సు సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్వకుర్తి, ఆమనగల్లు, హైదరాబాద్ ,ప్రాంతాలకు వెళ్లాలంటే తండావాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. హైదరాబాదు నుంచి గట్టిప్పలపల్లి కి వచ్చే బస్సులను ఆమన్ గల్ , చౌదర్పల్లి, గొల్లోనిపల్లి, పోచమ్మ గడ్డ తండా, మర్రి గుంత తండా, కొత్త తండా మీదుగా కేశ్లి తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
రైతులు పండించిన ధాన్యం, కూరగాయలు,ఆకుకూరలు హైదరాబాద్ మార్కెట్ కు తీసుకుపోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. మంచి రోడ్డు సౌకర్యం ఉన్న కేస్లీ తండాకు వెంటనే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని , కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ చూపాలని కోరారు.