వనపర్తి, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఉండొద్దని, వారి కండ్లల్లో సంతోషం నింపాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు పంటల సీజన్ వస్తే అప్పుల కోసం తిరిగే రైతలన్నకు ఇప్పుడా పరిస్థితి లేదు. రైతుబంధు పేరుతో ముందస్తు పెట్టిబడి సాయం అందజేస్తూ రైతన్నకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మార్చి 10, 2018లో ప్రారంభించిన ఈ పథకం వ్యవసాయరంగం తీరుతెన్నులను మార్చివేసింది. వ్యవసాయం దండగా అన్న పరిస్థితి నుంచి పండుగలా తయారుచేసింది.
వలసల జిల్లా వనపర్తి నుంచి బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారు తిరిగివస్తుండగా, బతుకుదెరువు కోసం జీవనోపాధి వెతుక్కుంటూ వ్యవసాయకూలీలు మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వస్తున్నారు. బీడువారిన నేలలు, నెర్రెలు కొట్టిన పొలాలకు ఆలవాలమైన వనపర్తి ఇప్పుడు సిరుల పంటలు కురిపిస్తూ రైతులను రాజులను చేస్తున్నది. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడి రైతుల తలరాతలు మారిపోయాయి.
ఆర్థికంగా పరిపుష్టి చెందుతూ ఆనందంగా జీవిస్తున్నారు. రైతుబంధుకుతోడు 24గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకంతో చెరువులు నింపి సాగునీటి గోస తీర్చడంతో పల్లెల్లో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సాగునీటిపై ప్రత్యేకశ్రద్ధ కనబర్చి రైతులకోసం రాత్రింబవళ్లు కష్టపడి తెచ్చిన నీళ్లు నీళ్ల నిరంజన్‌రెడ్డిని చేస్తే.. బుక్కెడు బువ్వకు గోసపడ్డ రైతుల పొలాలు ధాన్యపు రాశులతో కళకళలాడుతున్నాయి. దానికి నిదర్శనమే ఒకప్పుడు మెట్ట పంటలకు మాత్రమే పరిమితమైన ప్రాంతం ప్రస్తుతం పచ్చని పొలాలతో అలరారుతున్నది.

వనపర్తిలో రూ.1,532 కోట్ల పంపిణీ..
రైతుబంధు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో రైతుబంధు పథకానికి ఎకరాకు వానకాలం, యాసంగి సీజన్లు కలిపి రూ.1,532కోట్లను అందజేశారు. ఇంత పెద్ద మొత్తంలో రైతులకు ఏటా అందజేస్తున్నారు. ఎకరాకు వానకాలం రూ.5వేలు, యాసంగికి రూ.5వేలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో రైతుబంధును డిసెంబర్లో అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆమోదం లభించిందని చెప్పారు. త్వరలో బ్యాంకు ఖాతాలో జమకానున్నాయి. ఎవరి ప్రమేయం లేకుండా దళారుల బెడద లేకుండా నేరుగా రైతు ఖాతాకే రైతుబంధు రావడం హర్షణీయం. ప్రపంచంలో ఎక్కడా లేని పథకం తెలంగాణ రైతులకు వరంగా మారింది. ప్రతి సీజన్‌కు దాదాపు 1.50లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు. గత సీజన్లో 1,71,467మంది లబ్ధిపొందారు.
త్వరలో రైతుబంధు
యాసంగి పంటకు సంబంధించి రైతుబంధు త్వరలో రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు వ్యవసాయశాఖ తరఫున సిద్ధం చేస్తున్నాం. రైతుబంధు వచ్చాక వ్యవసాయరంగం పురోగతి వేగం పుంజుకున్నది. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. వివిధ పంటలు పండించేందుకు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను ప్రోత్సహిస్తున్నారు.
– సుధాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, వనపర్తి
సీఎం కేసీఆర్‌తోనే మేలు
నాకు ఐదెకరాలు ఉన్నది.తెలంగాణ వచ్చాక రైతు బతుకు బాగైంది. రైతుబం ధు వచ్చాక ఎవరి దగ్గరకు పెట్టుబడికి వెళ్లడం లేదు. మంత్రి నిరంజన్‌రెడ్డి పొ లాలకు నీళ్లు తెచ్చిండు. కేసీఆర్ సార్ వచ్చాక మా బతుకులు మారినయి. ఉ చిత కరెంట్, పొలాలకు నీళ్లు వస్తున్నా యి. ఇంతకన్న మంచిగా ఏ ముఖ్యమం త్రి చేయలేదు.
– మేకల నాగన్న, రైతు, రాజపేట, వనపర్తి
