జడ్చర్ల, మే 24 : ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వల్లే తమ కుటుంబం బాగుపడిందని కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావలి కొమురమ్మ పేర్కొంది. జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావళి పెంటయ్యకు భార్య కొమురమ్మ, కుమార్తె శివలీల, కుమారులు రాజేశ్, విక్రం ఉన్నారు. వీరిది పేదకుటుంబం. భార్యాభర్తలు ఇద్దరు వ్యవసాయ కూలీపనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. ఈక్రమంలో పెద్దకూతురు శివలీల పెండ్లి చేశారు. కొన్నేండ్లకు పెంటయ్య ఊపిరితిత్తుల సమస్యతో వైద్యం కోసం అప్పు చేసి చికిత్స చేయించుకున్నాడు. చాలా రోజుల వరకు మంచంలోనే ఉన్న పెంటయ్య 2020 అక్టోబర్ 27న మృతి చెందాడు. రైతు పేరుమీద ఒకగుంట భూమి ఉండటంతో ప్రభుత్వం అతడి భార్య కొమురమ్మ ఖాతాలో రూ.5లక్షల జమచేసింది. ఆ నగదులో రూ.3లక్షలతో కొమురమ్మ అప్పులు తీర్చి.. కూతురుకు పెండ్లికి ఇవ్వాల్సిన రెండున్నర తులాల బంగారాన్ని తీసుకొంది. మిగతా డబ్బులు కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినట్లు లబ్ధిదారురాల తెలిపింది. కేసీఆర్ సార్ తెచ్చిన రైతుబీమా వల్లే తమకు డబ్బులొచ్చాయని.. లేకుంటే తాము అప్పులపాలై పోయేవాళ్లమని ఆమె పేర్కొంది. కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబీమా పథకం వల్ల.. ప్రమాదవశాత్తు రైతులు మరణిస్తే బీమా డబ్బులొస్తున్నాయి. ఆ డబ్బులతోనే చాలా మంది రైతు కుటుంబాలు బాగుపడుతున్నాయని కొమురమ్మ చెప్తోంది.
నాభర్త పేరుమీద ఒక గుంట భూమి ఉన్నందు వల్లే మాకు బీమా పైసలొచ్చాయి. అది లేకుంటే మా బతుకులు ఆగమయ్యేవి. బీమా డబ్బులతో చేసిన అప్పులు తీర్చడంతో ఇప్పుడు హాయిగా ఉన్నాం. కేసీఆర్ సారు సల్లగుండాలే. ఆయనకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం
పెబ్బేరు, మే 24 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ఎంతోమంది పేద రైతుల కుటుంబాలను ఆదుకుంటోంది. రైతు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.5లక్షల బీమా అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకం సత్ఫలితాలనిస్తున్నది. పెబ్బేరుకు చెందిన గోనెల పెద్ద కురుమూర్తి లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. ఈక్రమంలో అతడు అనారోగ్యానికి గురి కాగా వైద్యులు హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. కార్పొరేట్ దవాఖానలో చేర్పించగా, లివర్ దెబ్బతిన్నదని డాక్టర్లు చెప్పారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి ఆరోగ్యశ్రీ కూడా వర్తించ లేదు. దీంతో వారు అప్పు చేసి వైద్యం చేయించినా 2022 సెప్టెంబర్ 13న కురుమూర్తి మరణించాడు. మృతుడి పేరు మీద 6 గుంటల భూమి ఉండడంతో ఆ కుటుంబానికి రైతుబీమా వర్తించింది. ఎలాంటి పైరవీలు లేకుండానే రూ.5లక్షలు నామినీ అకౌంట్లో పడడంతో వైద్యం కోసం చేసిన అప్పులను వారు తీర్చుకున్నారు. మిగిలిన రూ.50వేలు ఇంటి అవసరాలకు వాడుకున్నారు. ప్రభుత్వ సాయం అందకుంటే తాము అప్పుల్లో చిక్కుకునే వాళ్లమని మృతుడి పెద్ద కుమారుడు గోనెల నరేశ్ తెలిపారు. కురుమూర్తి భార్య గతంలోనే చనిపోగా వారికి ఇద్దరు కుమారులు నరేశ్, రాకేశ్ ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం డ్రైవర్లుగానే జీవనం సాగిస్తున్నారు. నరేశ్ పెబ్బేరులో జీవిస్తుండగా రాకేశ్ హైదరాబాదులో ఉంటున్నాడు.
నారాయణపేట ,మే 24 : ఐదేండ్ల కిందట తన భర్త మరణించడంతో ఇద్దరు కుమారులతో తల్లి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. ఈక్రమంలో ఆమె కూడా అనారోగ్యంతో రెండేండ్ల కిందట మరణించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కృంగిపొయింది. మృతురాలి పేరు మీద పొలం ఉండటంతో రైతుబీమా వర్తించి ఆ కుటుంబాన్ని కష్టాల నుంచి గట్టెక్కించింది. నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామానికి చెందిన బాలగారి లక్ష్మమ్మకు గ్రామ శివారులో రెండెకరాల 4 గుంటల పొలం ఉండేది. రెండేండ్ల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో రైతుబీమా వర్తించింది. కుటుంబంలోని ఆమె చిన్న కుమారుడు బాలగారి చిన్న నామినీగా ఉండడంతో అతడి ఖాతాలో రూ.5లక్షలను ప్రభుత్వం జమచేసింది. ఆ డబ్బుతో చిన్న పెండ్లి చేసుకొని మిగిలిన నగదుతో వ్యవసాయం చేస్తున్నాడు. రైతుబీమా లేకపోతే మా కుటుంబం రోడ్డున పడేదని చిన్నా పేర్కొన్నాడు. తనలాంటి ఎంతోమందిని ఈ పథకం ఆదుకున్నదని అతడు తెలిపాడు. కేసీఆర్ సార్ ఎంతో దూరదృష్టితో ఈ పథకాన్ని తీసుకొచ్చినందుకు ఆయనకు మా కుటుంబం రుణపడి ఉంటుందని పేర్కొన్నాడు.