కృష్ణా నదికి వరద పోటెత్తుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు నీలవేణి పరుగులు పెడుతున్నది. ఆల్మట్టి డ్యాంకు 1.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువకు 1.75 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ డ్యాంకు 1.42 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా గేట్ల ద్వారా 1.18 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 36 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో ఈ ఏడాది మొదటి సారి జూరాల గేట్లెత్తారు. దిగువ, ఎగువ జూరాలలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఏడు గేట్లు, పవర్‌హౌస్ ద్వారా 71 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకుగానూ ప్రస్తుతం 817 అడుగులకు చేరింది. రామన్‌పాడు ఒక్క గేట్ ఎత్తారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 23 అడుగులకు చేరింది. సరళాసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.
మహబూబ్‌నగర్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో అప్పర్ కృష్ణ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ఆల్మట్టి, నారాయణపూర్డ్యాం నుంచి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. అక్కడి నుంచి ప్రవాహం వస్తుండడంతో గురువారం అధికారులు జూరాల డ్యాం 7 గేట్లు తెరిచారు. 27,482 క్యూసెక్కులను విడుదలవుతున్నది. పవర్‌హౌస్ 41,633 క్యూసెక్కులు కాగా, ఎత్తిపోతలకు మొత్తం కలిపి 71,626 క్యూసెక్కులు కృష్ణమ్మ శ్రీశైలం వైపు బిరబిరా పరుగులు పెడుతున్నది.
ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, భీమా లిఫ్టు-1కు 1,300, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 36,800 క్యూసెక్కులు నమోదు కాగా, పవర్‌హౌస్‌లోని 12యూనిట్లలో 316 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. కృష్ణ, భీమా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తడంతో ఒకటి, రెండ్రోజుల్లో పీజేపీ గేట్లన్నీ ఎత్తేసే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్థిస్థాయి ప్రాజెక్టు సామర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ 3.901 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గరిష్ఠ నీటిమట్టం 1045 అడుగులకుగానూ 1041.601 అడుగులకు చేరింది. అలాగే ఆల్మట్టి ప్రాజెక్టుకు 1,65,833 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. లక్షా 75 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1697.78 అడుగులకు చేరగా.. 129.72 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 89.800 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో భారీగా వస్తోంది. దీంతో 21 గేట్లు మీటర్ ఎత్తు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Mahabubnagar1
ఇన్‌ఫ్లో 1,42,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,18,980 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ 1607.78 అడుగులకు చేరగా.. పూర్థిస్థాయి సామర్థ్యం 37.640 టీఎంసీలకుగానూ 26.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు ప్రాజెక్టుల నుంచి విడుదలైన నీరంతా జూరాలకు చేరేందుకు 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. టీబీ డ్యాంకు లక్షా 21,918 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 64 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 54.138 టీఎంసీలు నిల్వ ఉండగా.. నీటిమట్టం 1633 అడుగులు ఉండగా.. 1617.32 అడుగులకు చేరిందని డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. శుక్రవారం హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాల్వలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రామన్‌పాడు ప్రాజెక్టుకు ఒక్క గేటు తెరిచి 1,500 క్యూసెక్కులు విడుదల చేశారు.
కందురు వాగు పారుతుండడంతో సరళాసాగర్‌కు నెమ్మదిగా ప్రవాహం పెరిగింది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు కృష్ణమ్మ చేరడంతో జలకళను సంతరించుకున్నది. ప్రస్తు తం 23 అడుగుల నీటిమట్టానికి చేరింది. ప్ర స్తుతం జూరాల నుంచి 74 వేల క్యూసెక్కులు విడుదలవుతుండగా.. మరో 24 గంటల్లో లక్ష క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నది. డ్యాం వ్యూను తిలకించేందుకు సందర్శకులు భారీగా వస్తున్నారు. బీచుపల్లి, సోమశిల ప్రాంతాల్లో కృష్ణమ్మ నిండగా ప్రవహిస్తున్నది. వరద భారీగా వస్తున్న నేపథ్యంలో నది పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అధికారులు సూచించారు. నదీతీర ప్రాంతాల్లో పర్యటించారు. చేపల వేటకు వెళ్లడాన్ని నిషేధించారు. తీర ప్రాంతాల్లో, వాగులు, వంకల వద్ద రెవెన్యూ, పోలీసు సిబ్బంది గస్తీ కాస్తున్నారు.