ఆత్మకూరు, జూలై 22 : వరద రాకతో జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఎగువ నుండి వరద జూరాలకు చేరుతుండడంతో అధికారుల ఆదేశాల మేరకు జూరాల జెన్కో జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈ రామసుబ్బారెడ్డి ఎగువ జూరాల ప్రాజక్టులో పూజలు నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. మొదటగా ఒక్కో యూనిట్‌ను ప్రారంభించగా అర్ధరాత్రి నుంచి ఎగువ, దిగువ ప్రాజక్టుల్లో విద్యుదుత్పత్తి కొనసాగింది. మొత్తంగా నాలుగు యూనిట్లలో 154 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ఈ సీజన్ ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముందస్తుగా విద్యుదుత్పత్తిని ప్రారంభించి నీటిని సద్వినియోగం చేసుకుంటామని ఎస్ఈ తెలిపారు. కార్యక్రమంలో డీఈలు, ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు.