e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home జోగులాంబ(గద్వాల్) నల్లమలలో సఫారీ

నల్లమలలో సఫారీ

 • గతనెల 17న ప్రారంభమైన జంగల్‌ టూర్‌
 • అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో సేవలు
 • రోజుకూ 12 మంది పర్యాటకులకు అవకాశం
 • వచ్చే సంక్రాంతి వరకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఫుల్‌
 • ప్యాకేజీతో ఆకట్టుకుంటున్న అటవీ శాఖ
 • ప్రకృతి అందాలను తిలకిస్తున్న సందర్శకులు

కృష్ణానది సోయగాలు.. పక్షుల కిలకిలరావాలు.. జాలువారే జలపాతాలు.. గలగలపారే కాలువలు.. క్రూరమృగాల గాండ్రింపులు.. వన్యప్రాణుల సందళ్లు.. అబ్బురపరుస్తున్న శిలలు.. వ్యూ పాయింట్లు.. కట్టిపడేస్తున్న ప్రకృతి అందాలు.. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు.. ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌లు.. నల్లమల సొంతం. వీటిని ప్రకృతి ప్రేమికుల చెంతకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో గత నెల 17న జంగల్‌ సఫారీని ప్రారంభించింది. ట్రెక్కింగ్‌, వసతితో ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేయడంతో ఆన్‌లైన్‌లో పలువురు పేర్లను నమోదు చేసుకున్నారు. రోజుకూ 12 మంది సందర్శకులకు అడవిలో పర్యటించే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే డిసెంబర్‌ 1వ తేదీ వరకు 168 మంది తమ పేర్లను ముందుగానే నమోదు చేసుకున్నారు. వచ్చే సంక్రాంతి వరకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఫుల్‌ అయింది. నల్లమలలో పర్యటించి మధురానుభూతి పొందేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు.

అచ్చంపేట రూరల్‌, నవంబర్‌ 30:నల్లమల అటవీ అందాలు వర్ణించలేనివి. పక్షుల కిలకిలరావాలు.., జలపాతాలు.., జంతువుల ఉరుకులు.. పరుగులు.., ఆధ్యాత్మికత పంచే ఆలయాలు.., గలగల పారే కృష్ణానది.., సువిశాల అటవీ భాగం.., ఒళ్లు గగుర్లు పొడిచే లోయలు.., మలుపులు.., ప్రకృతి రమణీయత.., చెంచుల జీవన విధానం.. ప్రపంచంలో ఎక్కడా దొరకని వనమూలికలు.. ఇలా ఒక్కటేమిటీ అన్నీ నల్లమల సొంతం.. పర్యాటకులకు, ప్రకృతి ప్రేమికులకు నల్లమల అటవీ అందాలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. దేశంలోనే రెండో అతి పెద్దదైన అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ (ఏటీఆర్‌)లో నవంబర్‌ 17 నుంచి జంగల్‌ సఫారీ సేవలు ప్రారంభించారు. ఫారెస్ట్‌ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేశాయి. అటవీ ప్రాంతంలోని ఆలయాలు, జలపాతాలు వీక్షించేందుకు భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఈ క్రమంలో ఏటీఆర్‌ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించింది. రెండు వాహనాలతో జంగల్‌ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అమ్రాబాద్‌ ఎఫ్‌డీవో రోహిత్‌ గోపిడి తెలిపారు. బుధవారం వరకు 14 రోజులకుగానూ 168 మంది పర్యటించినట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ వరకు ఆన్‌లైన్‌లో బుక్కింగ్‌ ఫుల్‌ అయ్యాయని పేర్కొన్నారు.

- Advertisement -

రద్దు చేసుకునే నిబంధనలు..

 • ట్రిప్‌ రద్దు చేసుకోవాలంటే ఫారెస్టు అధికారుల నిబంధనలు పాటించాలి.
 • ట్రిప్‌ ఆర్డర్‌ నంబర్‌, పూర్తి పేరు, నమోదు తేదీ వంటి వివరాలు ఈ మెయిల్‌ ద్వారా ముందుగానే పంపాలి.
 • ట్రిప్‌ క్యాన్సల్‌ చేసుకున్న విధానాన్ని బట్టి డబ్బు తిరిగి ఇస్తారు.
 • 48 గంటల ముందు రద్దు చేసుకుంటే 50 శాతం, 24 గంటల ముందు అయితే 75 శాతం పట్టుకొని మిగతా డబ్బులు చెల్లిస్తారు.

పర్యాటకుల నిబంధనలు..

 • ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ట్రిప్‌ ఉంటుంది. వేళల్లో ఎలాంటి మార్పు ఉండదు.
 • పర్యాటకులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలి.
 • ట్రిప్‌ సమయంలో ధూమపానం, మద్యపానం చేయొద్దు.
 • బుక్‌ చేసుకున్న గదులకు సంబంధించి రూం సర్వీసులను అందించబడదు.
 • తప్పనిసరిగా గుర్తింపు కార్డులు వెంట తెచ్చుకోవాలి. బుకింగ్‌ వివరాలను వెరిఫై చేసుకునేందుకు సంబంధిత రుజువులు చూయించాలి.
 • ఎవరి వస్తువులకు వారే బాధ్యులు. డిపార్ట్‌మెంట్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.
 • చిన్నారులు ఉంటే తల్లిదండ్రులే బాధ్యత వహించాలి.
 • బుక్‌ చేసుకున్న గదుల మార్పు ఉండదు.
 • ట్రిప్‌ సమయంలో సంఘటనలు జరిగినా.., విపత్తులు సంభవించినా డబ్బులు తిరిగి చెల్లించరు.
 • ప్యాకేజీలో కేవలం ట్రిప్‌, వసతి గృహం, ట్రెక్కింగ్‌ చార్జీలు మాత్రమే వసూలు చేస్తారు. ఆహారం, గైడ్‌కు సంబంధించి డబ్బులు చెల్లించాలి.

ప్యాకేజీ ధరలు ఇలా..

 • జంగల్‌ సఫారీ ప్యాకేజీ ధరలను అటవీ శాఖ ఉన్నాతాధికారులు నిర్ణయించారు.
 • ఇద్దరు పర్యాటకుల ఫారెస్ట్‌ ట్రెక్కింగ్‌కు రూ.600, జంగల్‌ సఫారీకి రూ.2,000, ఒక డబుల్‌ బెడ్రూంకు రూ.2,000 మొత్తం టూర్‌కు రూ.4,600 ధర ఉంటుంది.
 • నలుగురు పర్యాటకుల ఫారెస్ట్‌ ట్రెక్కింగ్‌కు రూ.1,000, జంగల్‌ సఫారీకి రూ.2,000, రెండు డబుల్‌ బెడ్రూంలకు రూ.4,000.. ఇలా మొత్తం టూర్‌కు రూ.7వేలు ధర ఉంటుంది.
 • ఆరుగురు వ్యక్తుల ఫారెస్ట్‌ ట్రెక్కింగ్‌కు రూ.1,500, జంగల్‌ సఫారీకి రూ.2,000, మూడు డబుల్‌ బెడ్రూంలకు రూ.6,000.. ఇలా మొత్తం టూర్‌కు రూ.9,500 ధర ఉంటుంది.
 • ఎనిమిది మందికి ఫారెస్ట్‌ ట్రెక్కింగ్‌కు రూ.2 వేలు, జంగల్‌ సఫారీకి రూ.2,000, నాలుగు డబుల్‌ బెడ్రూంలకు రూ.8,000.. ఇలా మొత్తం టూర్‌కు రూ.12 వేలు ఉంటుంది.
 • పది మంది వ్యక్తుల ఫారెస్ట్‌ ట్రెక్కింగ్‌కు రూ.2,500, జంగల్‌ సఫారీకి రూ.2,000, ఐదు డబుల్‌ బెడ్రూంలకు రూ.10 వేలు.. ఇలా మొత్తం టూర్‌కు రూ.14,500 ఉంటుంది.
 • 12 మందికి ఫారెస్ట్‌ ట్రెక్కింగ్‌కు రూ.3 వేలు, జంగల్‌ సఫారీకి రూ.2,000, ఆరు డబుల్‌ బెడ్రూంలకు రూ.12 వేలు.. ఇలా మొత్తం టూర్‌కు రూ.17 వేలు ఉంటుంది.
 • ఫారెస్ట్‌ గైడ్‌కు ప్రతి సభ్యుడు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement