కోడేరు, ఆగస్టు 11: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (ఎంజీకేఎల్ఐ) ప్రాజెక్టులో అంతర్భాగమైన కోడేరు మండలం ఖానాపూర్ శివారులోని జొన్నలబొగుడ రిజర్వాయర్ నుంచి గుడిపల్లిగట్టు మూడో లిఫ్టునకు కృష్ణానది జలాలను శుక్రవారం ఎంజీకేఎల్ఐ అధికారులు వదిలారు. జొన్నలబొగుడ రిజర్వాయర్ హెడ్‌రెగ్యులేటర్ గేట్లను ఎత్తి వేయడంతో నీళ్లు ప్రధాన కాల్వ ద్వారా పరుగులు తీశాయి. కృష్ణానదికి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రభుత్వం ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్లలోకి నీటిని నింపడానికి 1, 2లిఫ్టుల్లో మోటర్లను ఆన్ చేయించింది. దీంతో నాలుగు రోజులుగా మోటర్ల నుంచి కృష్ణాజలాలను రిజర్వాయర్లలోకి ఎత్తిపోస్తున్నారు. గతేడాది జూలైలో నీటిని వదలగా.. ఈసారి సీజన్‌కు అనుకూలంగా వర్షాలు పడలేదు.
వానకాలం ప్రారంభమైన నెల తర్వాత కృష్ణా, తుంగభద్ర నదులు పొంగి ప్రవహిస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి అనూహ్యంగా ఇఫ్ఫ్లో అధికంగా వచ్చింది. దీంతో ప్రభుత్వం వరద నీటిని రిజర్వాయర్లలో నింపడానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే జొన్నలబొగుడ హెడ్‌రెగ్యులేటర్ గేట్లను ఎత్తి వేయడంతో కృష్ణాజలాలు కాల్వ వెంట పరుగులు పెట్టాయి. సెకండ్‌కు 250 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని ఎంజీకేఎల్ఐ ఈఈ రవీందర్ తెలిపారు. ఎంజీకేఎల్ఐ ప్రధాన కాల్వ మూడో కిలోమీటర వద్ద ఉన్న పసుపుల-పాన్‌గల్ బ్రాంచి కాలువ తూము కూడా తెరిచి నీటిని వదిలినట్లు వివరించారు. నీళ్లను కాలువలకు వదలడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.