వనపర్తి టౌన్, సెప్టెంబర్ 15 : యువత భవిత కోసమే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో రూ.2కోట్లతో నిర్మించనున్న ధోబీఘాట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రజక, మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో మంత్రికి వేర్వేరుగా శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లచెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ డీఈ మహాలక్ష్మి, ఏఈ భాస్కర్‌ను ఆదేశించారు. చెరువు ఆయకట్టు అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
వందేండ్ల భవిష్యత్ కోసం ప్రభుత్వం బాటలు వేసిందని, ప్రణాళికాబద్ధంగా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. సమైక్య పాలనలో తెలంగాణ వివక్షకు గురై రెండు తరాలు నష్టపోయిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం దశలవారీగా వ్యవసాయం, వైద్యం, విద్యతోపాటు సంక్షేమం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి చేతికి పని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ప్రజల ఆశీస్సులతో మూడోసారి అధికారంలోకి వస్తామన్నారు.
మంత్రి సమక్షంలో భారీగా చేరికలు..
వనపర్తి క్యాంప్ కార్యాలయంలో జంగిడిపురం యువకులు, రేవల్లి ఎంపీపీ సేనాపతి ఆధ్వర్యంలో కేశంపేటకు చెందిన కాంగ్రెస్ నేతలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నామని, మొక్కవోని విశ్వాసంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని యువకులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రమోద్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ ఇన్చార్జి ప్రకాశ్, రజకసంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్, కౌన్సిలర్లు, రజక, మత్స్యకార సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.