గద్వాలటౌన్, జూలై 5 : పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని 27, 28, 21, 36, 31వ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను ఇష్టానుసారంగా రోడ్లపై పారవేయడంతో పారిశుధ్యం లోపించి అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. అందుకని ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించే విధంగా చూడాలన్నారు. అలాగే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
కరోనా నియంత్రణలో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని 35వ వార్డులోని శారదా విద్యానికేతన్‌లో సోమవారం వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ ప్రారంభించారు. అర్హులందరికీ వ్యాక్యిన్ వేయించేలా చర్యలు తీసుకోవాలని మెప్మా సిబ్బందికి, వైద్యాధికారులకు సూచించారు.
కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులు
మల్దకల్, జూలై 5 : మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి. మల్లెందొడ్డిలో వీధుల్లోని మురుగు నీటి గుంతలను తొలగించారు. అలాగే ముళ్ల కంపలను జేసీబీ సాయంతో తొలగించారు. ఈ పనులను ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సమస్యలను గ్రామ సభలతో గుర్తించి పనులను వెంటనే పూర్తి చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ఇచ్చిన టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలన్నారు. అలాగే రోడ్డు పక్కన మొక్కలకు ట్రీగార్డులను అమర్చాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, కార్యదర్శి జితేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
హరితహారంతో పచ్చదనాన్ని విస్తరించాలి
గట్టు, జూలై 5 : హరితహారంతో పచ్చదనాన్ని విస్తరించాలని ఎంపీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. తన పదవీకాలం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హరితహారంలో భాగంగా మండల కాంప్లెక్స్ ఆవరణలో డీఆర్డీవో ఉమాదేవితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ అహ్మద్‌ఖాన్, ఎంపీడీవో రాఘవ, ఏపీవో రామలింగేశ్వర ప్రసాద్, సర్పంచ్ ధనలక్ష్మి, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఇమాంసాబ్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఎర్రవల్లి చౌరస్తా,జూలై 5: మండలంలోని ఎర్రవల్లి చౌరస్తా సోమవారం హరితహారంలో భాగంగా సర్పంచ్ రవి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ హరిత హారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాలుష్యం నుంచి రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటన్న, రాముడు, పెద్దలక్ష్మన్న, రాగన్న, దాసన్న, పరశురాముడు, ఆంజనేయులు పాల్గొన్నారు.