వనపర్తి, డిసెంబర్ 5: జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత వనపర్తి పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సకల హంగులతో పార్కుల ఏర్పాటు, చెరువులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లా ప్రజలకే కాకుండా కొత్తకోట నుంచి జిల్లాకేంద్రానికి వచ్చే ప్రజలకు అందుబాటులో వనపర్తి మండలంలోని రాజపేట శివారులో సకల హంగులతో పార్కును ఏర్పాటు చేసేలా మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవను తీసుకుంటున్నారు. పార్కుకు జయశంకర్ రాక్పార్క్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మంత్రి ముందుకు సాగుతున్నారు. ఆ దిశగా ఇటీవల స్థానిక నాయకులతో కలిసి మంత్రి పార్కుస్థలాన్ని పరిశీలించారు. పక్కనే టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం, మెడికల్ కళాశాల బాలుర హాస్టల్, రోడ్డుమార్గం నుంచి నేరుగా కలెక్టరేట్ వెళ్లే రహదారి ఉండడం, మైనార్టీల కోసం ఏర్పాటు చేస్తున్న షాదీఖానా దగ్గరలో ఉన్నది. దీంతో పార్కును అద్భుతంగా తీర్చిదితే ప్రజలకు సేదతీరడానికి, మార్నింగ్ వాక్కు జిల్లా కేంద్రం నుంచే కాకుండా కొత్తకోటకు వెళ్లేదారిలో ఉన్న గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎకరా 20గుంటల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
జయశంకర్ రాక్పార్కును వనపర్తి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.20లక్షలతో నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్కులో ప్రధానంగా వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట వస్తువులు, వృద్ధులు, వాకర్స్ కూర్చోవడానికి బెంచీలు, సహజసిద్ధంగా అనిపించే పక్షుల గూళ్లు, బొమ్మలను ఏర్పాటు చేసేలా మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రణాళికలు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. వనపర్తి కొత్తకోట మార్గమధ్యలో కావడం రెండు పట్టణాల ప్రజలకు సుందరంగా పార్కు కావడంతో సెలవు దినాల్లో పర్యాటక పార్కుగా రూపుదిద్దుకుంటుందని ప్రజలు భావిస్తున్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి ఏ పనిచేసినా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేస్తారు. జిల్లాకేంద్రం విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా శివారులో ఇలాంటి పార్కును ఏర్పాటు చేయాలని, అందులో అన్నిసౌకర్యాలు కల్పించడం వల్ల సెలవు దినాల్లో ప్రజలు, అధికారులు, ఉదయం, సాయంత్రం వేళ్లలో వాకర్స్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
– గట్టుయాదవ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి