నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 13 : బిజినేపల్లి మండలకేంద్రానికి అనుకొని ఉన్న జుట్టయ్యకుంట ధ్వంసం చేసిన ఘటనపై ఎట్టకేలకు కదలిక మొదలైంది. కుంట కట్టను చదును చేసేందుకు ఉపయోగించిన జేసీబీని పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. దీంతోపాటు కట్ట ధ్వంసానికి పాల్పడిన ఘటనలో పలువురు వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మార్చి 15వ తేదీ రాత్రి బిజినేపల్లి మండలకేంద్రంలోని 458 సర్వే నెంబర్లో ఉన్న జుట్టయ్యకుంట కట్టను కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రే ధ్వంసం చేసి చదును చేశారు.
మార్చి 16వ తేదీన గుర్తించిన వ్యక్తులు ఈఘటనపై గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వడంతో సర్పంచ్ ఇందిరా రాములు రెవెన్యూ, పోలీస్ శాఖలకు ఫిర్యాదు చేశారు. ఈవిషయంపై నమస్తే తెలంగాణ దినపత్రికలో మార్చి 22వ తేదీన ‘ఎమ్మెల్యే అండతో కుంట కబ్జా’ అనే శీర్షికన కథనం రావడంలో అధికార యంత్రాంగం స్పందించింది. 23వ తేదీన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కుంట వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. కట్టను ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని గుర్తించారు. కట్ట తొలగించి ఆస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులు గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు మార్చి 24వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అప్పటి నుంచి విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు కట్ట ధ్వంసానికి ఉపయోగించిన జేసీబీని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడమే కాకుండా, ఈఘటనకు పాల్పడిన నలుగురు వ్యక్తులను కూడా పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఓవైపు విచారణ జరుగుతుండగా కట్ట ధ్వంసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులతోపాటు, జేసీబీని స్టేషన్ బెయిల్‌తో వదిలిపెట్టేందుకు అధికారి పార్టీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.