కల్వకుర్తి, డిసెంబర్ 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేయకుంటే ఉద్యమం తప్పదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కె ట్ యార్డులో రుణమాఫీ కాని రైతులు సమావేశం అ య్యారు. ఇంకా 50శాతం మంది రైతులకు రుణమాఫీ కా వాల్సి ఉందని, ప్రభుత్వం మాత్రం వందశాతం రుణాలు మాఫీ చేశామని ప్రకటనలు ఇస్తుందని వారు ఆందోళన వ్యకం చేశారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు రోజుకో రీతిన అర్థం కాని విధంగా ప్రకటనలు ఇస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత సంవత్సరం డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పటికీ ఏడాది దాటినా.. రుణమాఫీపై ప్రభుత్వం అస్పష్టంగా తప్పించుకునే పద్ధతిన ముందుకు సాగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఏలాంటి కొర్రీలు లేకుం డా అమలు చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాకా డొంక తిరుగుడు మాటలతో కాలం గడిపేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. అత్యంత దురదృష్టం ఏమిటంటే.. ఇప్పటికి 50శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి ఎందుకు రుణమాఫీ కాలేదో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
కేవలం కల్లబొల్లి మాటలు చెబుతూ.. కొర్రిలు పెడుతూ రైతు రుణమాఫీని ఎగ్గొట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలుగా రుణమాఫీ కాని రైతులతో మండలాల వారీగా జేఏసీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశారు. కార్యక్రమంలో భాగంగా రుణమాఫీ కాని రైతుల జేఏసీ నాయకుడు బండెల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా మండలాల వారీ గా జేఏసీలను ఏర్పాటు చేయాలని ఉద్యమ సన్నాహక సదస్సులో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
కుటుంబ నిర్ధారణ చేసిన తర్వాత కూడా రుణమాఫీ చేయలేదని, 4వ విడుతలో రైతు రుణమాఫీకి సంబంధించిన జాబితా ప్రకటించి 20రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ రుణమాఫీ డబ్బులు సంబంధిత రైతుల ఖాతాల్లో జమచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రైతులను మోసం చేయడానికి ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగా తాము భావిస్తున్నామని రైతు నేత రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామం నుంచి రుణమాఫీ కాని రైతులు జాబితా సేకరించి మొదట తాసీల్దార్, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు.
అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే చలో కలెక్టరేట్, చలో సచివాలయం నిర్వహిస్తామని హెచ్చరించారు. పూర్తి రుణమాఫీ చేయకుండా, రైతు భరోసా ఇవ్వకుండా, పెండింగ్ పాల బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కకుండా ఘోర ఓటమి చవిచూసేలా తమ ఉద్యమం ఉంటుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వెంకటయ్య, రామకృష్ణారెడ్డి, శ్రీను, కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి, యాదగిరిరెడ్డితోపాటు వంగూర్, ఊర్కొండ, కల్వకుర్తి మండలాల రైతులు పాల్గొన్నారు.