వనపర్తి, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పెద్దమందడి మండలం దొడగుంటపల్లి ఊర చెరువు కట్టను జేసీబీతో గండికొట్టి పెద్దమందడి చెరువుకు నీళ్లు తీసుకెళ్లాలన్న ప్రయత్నాన్ని దొడగుంటపల్లి రైతులు అడ్డుకున్నారు. రెండు గ్రామాల రైతులు చెరువుకట్టపై పొట్లా డుకోవడం ఉద్రిక్తత వాతావరణాన్ని కల్పించింది. అనంతరం రైతుల సమాచారంతో వచ్చిన ఇరిగేషన్ డీఈ ఎండీ గఫార్ కట్టకు గండి కొడతామనడంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. రెండు గ్రామాలకు చెందిన రైతులైనప్పటికీ సమస్య మాత్రం ఒక్కటే.. అదే నీళ్ల సమస్య. దీనిపై సోమవారం ఆరు గంటలపాటు రెండు గ్రామాల రైతులు నీటి కోసం తగవులాడు కోవడం కొత్త సమస్యకు తెరలేపింది. పెద్దమందడి మండలంలోని అధిక గ్రామాల్లో యాసంగి సాగుబడులు పుష్కలంగా చేశారు. చెరువులు, బోరు బావుల ఆధారంగా కూడా వరిపంటలు సాగయ్యాయి.
మండలంలోని ఈ గ్రామాలకు కేఎల్‌ఐలోని పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీరందుతుంది. కాల్వ నుంచి చెరువులకు అటు నుంచి పొలాలకు నీరుందుతుంది. ప్రస్తుతం కాల్వలో సాగునీరు తక్కువగా వస్తుంది. ఈ పరిస్థితిలో దొడగుంటపల్లి ఊర చెరువు కింద దాదాపు 300 ఎకరాలు వరి ఉన్నది. వీరికి ఇంకా నెల రోజులు నీరు పారితే తప్పా పంటలు చేతికి రావు. ఈ గ్రామ చెరువులో ప్రస్తుతం 80శాతం నీరుంది. ఇంకా రెండు రోజులు కాల్వ నుంచి నీరు వస్తే దొడగుంటపల్లి ఊర చెరువు అలుగు పారుతుంది. ఈ అలుగుపారితే పెద్దమందడి చెరువుకు కాల్వ నీరు వెళ్తుంది.
ఇదిలా ఉంటే.. పెద్దమందడి చెరువు కింద సహితం 550 ఎకరాల వరకు వరి శిస్తు ఉంది. ఇక్కడ కూడా మరో 20 రోజులు నీరందితే చేల న్నీ చేతికి వస్తాయి. ప్రస్తుతం పెద్దమందడి చెరువులో నీరు పూర్తిగా అయిపోయింది. చెరువుకు నీరు అర్జంట్‌గా రావాలంటే.. పైన ఉన్న దొడగుంటపల్లి చెరువు కట్టకు గండి పెడితే.. తమ చెరువుకు నీరు వస్తుందని ఓ 20 మంది పెద్దమందడి రైతులు ఉదయం జేసీబీతో దొడగుంటపల్లి చెరువు కట్టకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న దొడగుంటపల్లి రైతులు 50మంది వరకు కట్ట దగ్గరకు పరుగు తీశారు. ఇరువురు రైతులు చెరువు కట్టకు గండిపై వాదనలు చేసుకున్నారు. చివరకు ఇరిగేషన్ డీఈ గఫార్‌కు సమాచారం ఇవ్వగా ఆయన కూడా వచ్చి దొడగుంటపల్లి చెరువు కట్టకు గండి పెట్టి మళ్లీ పూడ్చివేస్తామని చెప్పడంతో రైతులు తిరగబడినంతపని చేశారు.
ఎట్టి పరిస్థితిలోనూ గండి కొట్టేది లేదని, మీతో జీవో ఉంటే తీసుకురండంటూ రైతు లు డీఈని ఆక్షేపించారు. కాల్వకు నీరు అధికంగా తీసుకొస్తే.. ఒకే రోజు అలుగుపారి పెద్దమందడి చెరువుకు నీరు వెళ్తుందని రైతులు డీఈతో వాదించారు. చివరకు చిలికి.. చిలికి గాలివానలా సమస్య ఇరిగేషన్ ఈఈ మధుసూదన్ దృష్టికి వెళ్లడంతో హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు గ్రామాల రైతులకు నచ్చజెప్పి దొడగుంటపల్లి చెరువు తూంలో నుంచి పెద్దమందడి చెరువుకు నీరు పోయే విధంగా మాట్లాడడంతో తాత్కాలికంగా సమస్యను సద్దుమణిగింది.