మూసాపేట్ : కాంగ్రెస్ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలకు రక్షణ లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో రెండేళ్లలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయిపోయాయని ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ( Errolla Srinivas ) , మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar Reddy ) ఆరోపించారు.
బాధిత కుటుంబ సభ్యులను వారు కలిసి పరామర్శించి ఓదార్చారు. దళిత బాలిక ఆత్మహత్య చేసుకుంటే ,షాద్ నగర్ ,కొల్లాపూర్లో దళిత మహిళ, చెంచు మహిళను కొడితే ఈ రోజు వరకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో సామూహిక అత్యాచారంతో చనిపోయిన యువతి ఘటన పట్ల ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.
సీఎం సొంత జిల్లాలో దారుణం జరిగితే ప్రజా ప్రతినిధులు,జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకోవాల్సి ఉండగా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఈ విషయంలో పోలీసులు ఎందుకు సమగ్ర దర్యాప్తు చేయడం లేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఎస్సీలపై వివక్ష ఎందుకని నిలదీశారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే పోలీసులు కేసును నీరుగార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి భట్టికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు చేసి , నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మూసాపేటలో ఘటనలో మృతి చెందిన ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయాలు పక్కన పెట్టీ దళిత కుటుంబానికి అధికారులు న్యాయం చేయాలి.