మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 28: ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ కే.నర్సింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. ఈ నెల 10న రాజాపూర్ మండలంలోని టాటా ఇండి క్యాష్ ఏటీఎంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రూ. 7,82,300 నగదు చోరీ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త్తు చేపట్టిన పోలీసులు నిందితులు తెల్లని ఫార్చ్యూనర్ కారును వినియోగించినట్లు గుర్తించారు.
ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా కారు కదలికలను గమనిస్తున్న పోలీసులు మంగళవారం బాలానగర్ ఏటీఎంవద్ద ఉన్నట్లు గుర్తించి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా ఏటీఎం దోపిడీకి పాల్పడ్డట్టు అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలోని భటిండా జిల్లాకు చెందిన గుర్గగన్ సింగ్, భూపేందర్ సింగ్, రష్పాల్, సందీప్ సింగ్ ముఠాగా ఏర్పడి ఏటీంలలో చోరీకి పల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. భూపేందర్ సింగ్ (బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ ఆఫ్టికేషన్) పూర్తి చేసి 15 సంవత్సరాలుగా ఏటీఎంలలో నగదు లోడ్ చేయడం, టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. అందులో తక్కువ ఆదాయం రావడంతో అతని స్నేహితుడైన గుర్గగన్ సింగ్ సూచనతో రష్పాల్ సింగ్, సందీప్ సింగ్‌లతో కలిసి ఏటీఎం లలో నగదు చోరీచేసేందుకు నిర్ణయించుకున్నారు.
10 నిమిషాలలోనే..
భూపేందర్ సింగ్, రష్పాల్ సింగ్ ఏటీఎం టెక్నీషన్గా పని చేసిన అనుభవంతో చోరీ చేయాలనుకునే ఏటీఎంను గుర్తించి అందులో ముందుగా మైక్రో సీసీ కెమెరాలు పెడతా రు. దాని నుంచి నగదు డిపాజిట్ ఏజెన్సీ సిబ్బంది నమో దు చేసే పాస్‌వర్డ్‌ను గమనించి సిబ్బంది వెళ్లిన వెంటనే ఏటీఎం సెంటర్లోకి వెళ్లి సీసీ కెమెరాల కన్క్షన్ తొలగించి ఏటీఎంను ధ్వంసం చేయకుండా, ఎవరికీ అనుమానం రాకుండా పాస్‌వర్డ్‌తో ఏటీఎం మిషన్ ఓపెన్ చేసి 10 నిమిషాలోనే అందులోని నగదును దోచుకుంటారు. అలాగే రాజాపూర్‌లోని ఏటీఎంలో రూ. 7లక్షలు చోరీ చేసినట్లు ఎస్పీ వివరించారు.
కొత్త ఏటీఎంలో నగదు జమచేసేటప్పుడు సంబంధిత బ్యాంక్ అధికారులకు వోటీపీ వెళ్తుందని వారు ఆ నెంబర్ చెబితేనే మిషన్ ఓపెన్ అవుతుందన్నారు. పాత మాన్యూవల్ ఏటీఎంలకు వోటీపీ రాదని అలాంటి వాటినే నిందింతులు ఎంచుకొని చోరీకి పాల్పడుతున్నాట్లు తెలిపారు.
ఫాస్ట్‌ట్యాగ్ ఆదారంతో…
రాజాపూర్ ఎటీఎం వద్ద తెల్ల కలర్ పార్చ్యూనర్ కారు లో నిందితులు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు బాలానగర్ టోల్గేట్ వద్ద నమోదైన ఫాస్ట్‌ట్యాగ్ ఆదారంతో కారును గుర్తించారు. అదే కారు మంగళవారం బాలనగర్వైపు వస్తునట్లు గుర్తించిన పోలీసులు నిఘాపెట్టి నిందితులు బాలానగర్ ఏటీఎంవద్ద రెక్కి నిర్వహిస్తున్న గుర్గగన్ సింగ్, భూపేందర్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. రష్పాల్, సందీప్ సింగ్‌లు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నింది తుల నుంచి రూ.5 వేల నగదు, పార్చ్యూనర్ కారు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ముఠా 20 22లో సంగారెడ్డిలో ఓ ఏటీఎంలో రూ.30 లక్ష లు, రంగా రెడ్డి జిల్లాలో 3 లక్షల నగదు చోరీ చేయడంతో పాటు ఉత్తర్ ఖాండ్, పంజాబ్, రాజస్థాన్, చండీఘర్ తదితర రాష్ర్టాల్లోని ఏటీఎంలలో చోరీకి పల్పడ్డట్లు నిందితులు తెలిపారన్నారు. కేసును చేధించిన మహబూబ్‌నగర్ డీఎస్పీ మహేశ్, జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప, సీసీఎస్ సీఐ ఎండీ ఇఫ్త్తకార్ ఆహ్మద్, బాలనగర్, రాజాపూర్ ఎస్సైలు, ఐడీ పార్టీ కానిస్టేబుల్స్ బాలచంద్రుడు, వెంకటేశ్‌లను ఎస్పీ ఆభినందించి రివార్డు అందజేశారు. విలేఖరుల సమావేశంలో ఏఎస్పీ ఏ.రాములు, సీసీఎస్ డీఎస్పీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.