కోడేరు, మే 6 : మామిడి పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ఒక ఎత్తయితే సరైన సమయంలో కోత కోసి మార్కెటింగ్ చేసుకోవడం మరో ఎత్తు. ఈ రెండు సక్రమంగా చేసినప్పుడే మామిడి రైతులు మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉన్నా యి. మామిడి కోతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉద్యానవన శాఖ కొల్లాపూర్ డివిజన్ అధికారి లక్ష్మణ్ వివరించారు. జిల్లాలోని అచ్చంపేట డివిజన్లో 2616.76 ఎకరాలు, కల్వకుర్తి డివిజన్లో 5199.31 ఎకరాలు, కొల్లాపూర్ డివిజన్లో 26317.06 ఎకరాలు, నాగర్‌కర్నూల్ డివిజన్లో 3210.89 ఎకరాలు కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 37343. 02 ఎకరాలలో మామిడి తోటలు సాగు చేశారని ఆయన వివరించారు.
మామిడిలో కాయ తెంపడం ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు కొనసాగుతుంది. మే నెలలో ఎక్కువగా కోతకు వస్తాయి. మామిడి కోత సమయంలో తీసుకునే జాగ్రత్తలను బట్టి కాయ నాణ్యత కాయ రుచి ఆధారపడి ఉం టుంది. సరైన పక్వ దశలో కాయలు కోయకపోవడంతో దాదాపు 30-40 శాతం కాయలు పాడవుతున్నాయి. ఒకసారి చెట్టు నుంచి కాయను కోసిన తర్వాత చెట్టుపైన పొందే కాయ నాణ్యతను పెంపొందించడం కష్టం. కాయ పూరిపక్వ దశకు చేరక ముందే కాయ ను కోస్తే పండుగా మారక ఎండిపోయే అవకాశం ఉంటుంది.
కాయ గాలికి గాకుండా మామూలుగా రాలితే తెంపడానికి సిద్ధంగా ఉందని అనుకోవచ్చు. బంగినపల్లిలో పంచదార శాతం 9 నుంచి 8.5 వరకు పెరిగినప్పుడు తెంపితే పండు నాణ్యత దెబ్బతినదు కాయలో వచ్చే కొన్ని మార్పులను బట్టి కాయ ముదిరినది లేనిది తెలుసుకోవచ్చు. కొన్ని మామిడి రకాల్లో పండు పసుపు రంగుకు మారడం మరికొన్ని రకాల్లో పక్వత తెలియచేస్తు బూడిద లాంటి పొర ఏర్పడుతుంది. కాయ తొడిమకు దగ్గరగా రంగు మార్పు కాయ తుంచితే వచ్చే సాన సాంద్రత తగ్గడం కాయ కోతకు సూచనలుగా భావించవచ్చు. కాయలు కోసేటప్పుడు కింద పడకుండా దెబ్బతినకుండా కొక్కెం వలె కట్టిన వెదురుకర్రతో కోయాలి.
మామడి కాయ మూడు దశల్లో పరిపక్వత చెందుతుంది. మొదటి దశలో కాయలు 95 నుంచి 100 రోజుల్లో 7-9శాతం పంచదార కలిగి ఉంటాయి. వీటి విలువ వ్యవధి 20 నుంచి 25 రోజుల ఈదశలో కాయలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. రెండో దశలో లేత ఆకుపచ్చ కంటే మరి కొంత తెలుపు దనం కలిగి తెల్లని మచ్చలు స్పష్టంగా ఏర్పడతాయి. కాయలు 100 నుంచి 105 రోజుల్లో 9-10 శాతం పంచదార కలిగి ఉంటాయి. ఈ దశలో అతి తక్కువ సమయం లో ఎగుమతులు చేయవచ్చును. మూడో దశలో కాయ పూర్తిగా పక్వం పొంది 11-12 శాతం పంచదార కలిగి ఉంటుంది. ఈ కాయలు 108 నుంచి 110 రోజుల్లో కోయవచ్చును. వీటి నిలువ వ్యవధి 10 నుంచి 12రోజులు మాత్రమే. కోసిన ఒకటి రెండు రోజుల్లో పండుగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో చెట్టుపైననే పండుగా మారుతుంది.
కొల్లాపూర్ నియోజకరవ్గంలో మామిడి మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు దళారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొల్లాపూర్‌కు మామిడి మార్కెట్ విక్రయ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మంజూరు చేయించారు. అయితే కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో దాని ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. కొంతమంది మధ్య దళారులు ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని తక్కువ ధరకు మామిడి కాయలను కొనుగోలు చేస్తు రైతులను నట్టేట ముంచు తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నా వెంటనే డబ్బులు ఇవ్వడం లేదని పలువురు రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని మామిడి మార్కెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.