
మహబూబ్‌నగర్ డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు పంటలే పండని తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలో దేశంలోనే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రంగా రికార్డు సృష్టించే స్థాయికి ఎదిగింది. కానీ, తెలంగాణ ఎదుగుదల కేంద్రానికి నచ్చలేదేమో.. అందుకే తెలంగాణ అన్నదాత పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు చేస్తూ రైతాంగాన్ని ఆగమాగం చేస్తోంది. రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర మంత్రుల బృందం రెండు రోజులుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు ఢిల్లీలో ఎదురుచూపులు చూస్తే ఆయన అవమానంగా మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ బీజేపీ నేతలను ఆగమేఘాల మీద ఢిల్లీకి రప్పించుకుని వారితో కలిసి రాజకీయాలకు తెరలేపిన కేంద్రమంత్రి.. రైతుల కోసం ఢిల్లీ వచ్చిన తెలంగాణ మంత్రుల బృందంపై విమర్శలు చేయడంపై జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌సీఐకి బియ్యం తరలింపులో తెలంగాణ విఫలమైందని అబద్ధాలు మాట్లాడిన కేంద్ర మంత్రి గోయల్ తీరుపై మండిపడ్డారు. ఎఫ్‌సీఐ గోదాముల్లో ధాన్యం నిల్వలు నిండిపోయినా కనీసం తరలించకుండా కేంద్రమే కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యేలు అంటున్నారు. తెలంగాణ సర్కారుకు రైతుల్లో ఉన్న మంచి పేరును చూసి తట్టుకోలేక రాజకీయాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పోరు కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
రైతుల కోసమే మా పోరాటం
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతు శ్రేయస్సే లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతున్నది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కనీసం సాగునీరు లేక రైతులు అన్యాయమయ్యే పరిస్థితి ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీటి లభ్యత పెరిగి బీడు భూముల్లో బంగారు పంటలు పండేలా మార్పు వచ్చింది. కానీ, కేంద్రం రైతుల నడ్డివిరిచే నల్లచట్టాలను తీసుకొస్తే రైతులు తిరగబడ్డారు. వందలాది ప్రాణాలు పోయినా కేంద్రంపై పోరాటం జరిపారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని వచ్చిన మంత్రులను అవమానించినట్లు మాట్లాడటం కేంద్రం అహంకారానికి పరాకాష్ఠ. రాష్ట్రంలోని అన్నదాతలు బీజేపీ నేతల తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారు.
పంజాబ్‌లో కొంటరు.. తెలంగాణలో కొనరా..
కేంద్రం ఆది నుంచి తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తోంది. గతంలో తెలంగాణలో పంటలు పండే పరిస్థితే ఉండేది కాదు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు బాగై పంటలు పండుతుంటే కొనేందుకు కేంద్రం విముఖత చూపిస్తోంది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రమైన తెలంగాణపై కేంద్రం కత్తి కట్టడం కరెక్టు కాదు. తెలంగాణ ధాన్యం కొనమని అనడం దుర్మార్గం. ధాన్యం సేకరించి కేంద్రానికి అప్పగించే బాధ్యత మాత్రమే రాష్ర్టాలది. కొన్న తర్వాత ఆ ధాన్యాన్ని ఎలాగైనా వినియోగించేలా చూసే బాధ్యత కేంద్రానిది. పంజాబ్‌లో ధాన్యం కొనే కేంద్రం.. తెలంగాణ వరకు వచ్చే సరికి కొర్రీలు వేయడం న్యాయం కాదు. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర తప్ప మరేమీ లేదు. కేంద్రం భేషజాలకు పోకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిందే.
ఇదేనా సుస్థిర పాలన..
కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయం అంటే తెలియదనేలా ప్రవరిస్తున్నారు. అన్నదాతను కేంద్రం దారుణమైన నిర్లక్ష్యం చేస్తోంది. రైతుల ప్రాణాలు పోయిన తర్వాత చట్టాలు రద్దు చేసిన దుర్మార్గమైన సర్కారు ఇది. రైతులకు ఎలా మంచి చేయాలో తెలియని ప్రభుత్వం కాబట్టే రైతు చట్టాల విషయంలో వైఫల్యం చెందారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సర్కారు అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా ఇక్కడి బీజేపీ వాళ్లకు అందటం లేదా.. వారికి తెలియదా ఇక్కడి రైతుల ధాన్యం కష్టాలు. రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రానికి సమాచారం అందించి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత లేదా..? కేంద్రం సుస్థిర పాలన అంటూ ప్రచారం చేసుకుంటోంది. రైతులు చనిపోయిన తర్వాత బుద్ధి వచ్చిందంటూ క్షమాపణలు చెప్పిన ప్రధాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోలు చేయాల్సిందే.
సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది
కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. గుజరాత్ ధాన్యం అంతా కొంటున్నారు. గుజరాత్‌కు ఓ న్యాయం. తెలంగాణకు ఓ న్యాయమా.. నాలుగేండ్లుగా తెలంగాణకు పైసా ఇవ్వలేదని.. వాళ్ల నిధులతోనే ప్రాజెక్టులు కట్టుకున్నారని కేంద్రమే తెలిపింది. అంటే తెలంగాణపై వారి వైఖరి తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా ఉండి రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించిన మంత్రులను అవమానించడం ఎంత మాత్రం కరెక్టు కాదు. దీనిని ఖండిస్తున్నాం. రైతుల సమస్యలపై దేశానికే తెలంగాణ నాయకత్వం వహిస్తుంది. స్వామినాథన్ రిపోర్ట్ అమలు చేసే వరకు పోరాటం ఆగదు.
కేసీఆర్ దీక్షతో భయం పట్టుకున్నది
రైతుల కోసం ఏనాడైతే సీఎం కేసీఆర్ దీక్ష చేపట్టాడో ఆ రోజునుంచే కేంద్రానికి భయంపట్టుకున్నది. తెలంగాణలో కేంద్రం తీరుకు నిరసన కార్యక్రమాలతో బీజేపీ సర్కారుకు ఆందోళన ప్రారంభమైంది. రైతుల పక్షాన టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పోరాటం ఆపరు. పోరాటాలు ముఖ్యమంత్రికి కొత్తకాదు. రైతుల ఉద్యమాన్ని తట్టుకోలేక నల్లచట్టాలను రద్దు చేశారు. దేశానికి కేంద్రం తీరును తేటతెల్లం చేస్తారని సీఎం కేసీఆర్ అంటేనే వారికి భయం. తెలంగాణ రైతులు రైతులు కాదా.. కేవలం ఎన్నికలున్న రాష్ర్టాల్లో మాత్రమే ధాన్యం కొంటారా.. ఎన్నికలప్పుడు మాత్రమే నిధులు ఇస్తారా.. ఇదెక్కడి రాజనీతి. సమాక్య పాలనకే కలంకం తెచ్చేలా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన భంగపాటును బీజేపీ మర్చిపోకూడదు. వారికి మళ్లీ భంగపాటు తప్పదు.
రైతులంటే ఎందుకంత చులకన
కేంద్రమంత్రి కోసం తెలంగాణ మంత్రుల బృందం రెండు రోజులపాటు ఎదురుచూస్తే అంత అవమానంగా మాట్లాడటం కేంద్రమంత్రి స్థాయికి తగదు. తెలంగాణ రైతులు రైతులు కాదా.. వారి సమస్యపై కూడా ఇంత అవహేళనగా మాట్లాడుతారా… కేంద్రం తీరు చాలా దుర్మార్గంగా ఉంది. సీఎం, మంత్రులపై వారి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఎలాగైనా రైతుల దృష్టిలో సీఎం కేసీఆర్, తెలంగాణ సర్కారుకు చెడ్డపేరు తేవాలనే కుట్రకు కేంద్రం తెరలేపింది. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల దృష్టిలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే కుటిల బుద్ధి కేంద్రం తీరుతో కనిపిస్తున్నది. కేంద్రం ఆడుతున్న నాటకాలు తెలుసుకోలేనంత అమాయకులు కాదు తెలంగాణ రైతులు. రైతులను అడ్డం పెట్టుకుని కేంద్రం చేసే కుట్రలను ఎండగడతాం.
ఇది కేంద్రం అహంకారానికి నిదర్శనం
రైతుల పక్షాన మాత్రమే మంత్రులు వెళ్లారు. పనిలేక కాదు. 40లక్షల మెట్రిక్ టన్నులు అయిపోయింది. బ్యాలెన్స్ ఇంకా ఇస్తాం. కొంటావా లేదా.. పోయిన సారి బియ్యమే ఇంకా గోదాముల్లో ఉన్నాయి. గోదాములే ఖాళీ కాలేదు. కౌకుంట్ల గోదాములో లక్ష టన్నులు పడుతాయి. అవే ఖాళీ కాలేదు. ఖాళీ చేయాల్సిన కేంద్రం, ఎఫ్సీఐది బాధ్యత. కావాలని గూడ్స్ పంపించకుండా చేస్తున్నారు. ఢిల్లీ వరకు పోతే అవమానిస్తున్నారు. ఇది వారి అహంకారానికి నిదర్శనం. రాబోయే కాలంలో బీజేపీని ఏవిధంగా తిరస్కరించాలో తెలంగాణ రైతాంగానికి తెలుసు.
బీజేపీ ఎంపీలు రాష్ర్టానికి ఏం చేశారు
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఈ ప్రాంత బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ర్టానికి అండగా ఉండాల్సింది పోయి ఇక్కడి ప్రజలను, రైతులను మోసం చేస్తున్నారు. ఈ మూడేండ్లలో తెలంగాణ బీజేపీ ఎంపీలు రాష్ర్టానికి చేసిందేమీ లేదు.. తెలంగాణకు సంబంధించి కేంద్రంతో పోరాటం చేసి సాధించింది ఏమీ లేదు. తెలంగాణ రైతుల ధాన్యం కేంద్రం సేకరించకుండా రాజకీయాలు చేస్తుంటే.. రాష్ట్ర రైతాంగం తరఫున స్థానిక బీజేపీ ఎంపీలు పూర్తిగా వైఫల్యం చెందారు. బీజేపీ నేతల నాటకాన్ని రాష్ట్ర ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నకు కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు.
– సీ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల