మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 16 : డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డ వ్యక్తికి కోర్టు న్యాయమూర్తి రోడ్డుపై నిలబడి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించాలని న్యాయమూర్తి వినూత్నమైన తీర్పును వెల్లడించినట్లు ట్రాఫిక్ సీఐ భగవంత్‌రెడ్డి తెలిపారు. తీర్పు అమలులో భాగంగా మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసులో శిక్ష పడిన వ్యక్తిని మంగళవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై రోడ్డుపై ప్లకార్డుతో నిలబెట్టి వచ్చిపోయే వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు వివరించే శిక్షను విధించారు.
శిక్ష అనేది కేవలం దండన మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సామాజిక సేవ రూపంలో న్యాయమూర్తి శిక్షను విధించారు. ఆగస్టు 24న సాయంత్రం బోయపల్లి రహదారిపై ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మోతినగర్, మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్ మద్యం సేవించి బైక్ నడుపుతూ పట్టుబడ్డాడు.
ఈ కేసులో మంగళవారం ఉదయం సెకండ్ క్లాస్ కోర్టు స్పెషల్ జడ్జి నిర్మల నిందితుడికి రెండు రోజుల సామాజక సేవతోపాటు రూ. 2వేలు నగదు జరిమానా విధించారు. దీంతో ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు పట్టుకొని వాహనదారులకు డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదని దీని వల్ల కలిగే నష్టాలను వివరించాలని ఆదేశిస్తూ శిక్ష విధించారు.