ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించిన దుందుభీ వాగులో జలసవ్వడి నెలకొన్నది. సమైక్య పాలనలో ప్రాభవం కోల్పోయిన వాగు ప్రత్యేక రాష్ట్రంలో పూర్వవైభవంసంతరించుకున్నది. కృష్ణానదికి ఉపనది అయిన దుందుభీ వాగుపై 33 చెక్‌డ్యాంలు నిర్మించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరవతో జడ్చర్ల నియోజకవర్గంలో రూ.45 కోట్లతో 22 ఆనకట్టలు కట్టారు. అంతేకాకుండా నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ 11 ఆనకట్టలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక చెక్‌డ్యాంలు ఉన్న వాగుగా రికార్డు సృష్టించారు. ఎక్కడికక్కడ ఆనకట్టలు నిర్మించడంతో భూగర్భజలాలు ఉప్పొంగుతున్నాయి. సుమారు 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. దీంతో రైతులు సంబురంగా సాగు చేపడుతున్నారు.
– మహబూబ్‌నగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందించిన దుందుభీ నదిలో జలసవ్వడులు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోకపోవడంతో ఆనవాళ్లు కోల్పోయిన దుందుభీకి మళ్లీ పూర్వవైభవం వచ్చింది. కృష్ణానదికి ఉపనది అయిన దుందుభీకి చారిత్రాత్మక వైభవం ఉన్నది. పాలమూరు జిల్లా చరిత్రలో ప్రాముఖ్యత గల ఈ నది ఒడ్డున అనేక చారిత్రాత్మక స్థలాలు ఉన్నాయి.
పరశవేదీశ్వరాలయం, ఆవంచ ఏకశిల గణపతి విగ్రహం చెప్పుకోదగ్గవి. మహబూబ్‌నగర్ జిల్లాలోని పురసంపల్లి కొండల్లో జన్మించిన దుందుభీ నది నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించి నల్లమలకొండల్లో కృష్ణమ్మతో సంగమిస్తుంది. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఈ నదిపై డిండి వద్ద భారీ ఆనకట్ట నిర్మించారు. జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో రాష్ట్రంలో అత్యధిక చెక్‌డ్యామ్‌లు కలిగిన నదిగా రికార్డు సృష్టించింది.
ఈ పెద్ద వాగుపై జడ్చర్ల నియోజకవర్గంలో ఏకంగా 22చెక్‌డ్యాంలు నిర్మించగా, నాగర్‌కర్నూల్ జిల్లాలో మరో 11చెక్‌డ్యాంలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే నీటి వృథాకు చెక్‌పెట్టారు. రూ.కోట్ల నిధులు వెచ్చించి దుందుభీపై నిర్మించిన ఈ చెక్‌డ్యామ్‌ల వల్ల జలసిరులు ఉప్పొంగుతున్నాయి. నల్లగొండ జిల్లాలో ప్రవేశించేవరకు ఉమ్మడి జిల్లాలో ఏకంగా 33 చెక్‌డ్యాంలు కట్టి తక్కువ ఖర్చుతో వాగు పరివాహక ప్రాంతాల్లో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. భూగర్భజలాలు పెరగడంతో నదీపరివాహక ప్రాంతాల సమీపంలోని గ్రామాల్లో తాగునీటికి ఢోకా లేకుండా పోయింది.
రూ. 120కోట్లతో చెక్‌డ్యాంలు.. రికార్డు బ్రేక్
ఒక నదిపై ఇంతపెద్ద మొత్తంలో చెక్‌డ్యాంలు నిర్మించి తక్కువ ఖర్చుతో నీరు, తాగునీరు అందిస్తున్న ఏకైక నియోజకవర్గం జడ్చర్ల. రాష్ట్రంలో అత్యధిక చెక్‌డ్యాంలు కలిగిన నియోజకవర్గం ఇదే. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరవతో సుమారు రూ. 45కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు 22చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టారు. బాలానగర్ మండలంలోని సురారం, గుండేడ్, బాలానగర్, బోడజానంపేట, గౌతాపూర్, రాజాపూర్ మండలంలోని ఈదుగాన్పల్లి, మల్లెపల్లి, జడ్చర్ల మండలంలోని లింగంపేట, నెక్కొండ, ఆల్వన్పల్లి, గుట్టకాడిపల్లి, మిడ్జిల్ మండలం దోనూరు, అయ్యవారిపల్లి, చిల్వేరు, వెలుగొమ్ముల, కొత్తూరు, వాడ్యాల, మున్ననూరు, సింగందొడ్డి, మిడ్జిల్ వద్ద పెద్దఎత్తున చెక్‌డ్యాంలు నిర్మించారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో సిర్సవాడ, నేరెళ్లపల్లి, బెక్కర, పాపగల్, గోవిందాయపల్లి, ఆకునెల్లికుదురు, మేడిపూర్, గుట్టలపల్లి, నడిగడ్డ, మిట్టసదగోడు, డిండిచింతలపల్లిలో రూ.75కోట్లతో మరో 11 చెక్‌డ్యాంలు నిర్మించారు. దీంతో వాగులో కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచి రిజర్వాయర్లను తలపిస్తున్నాయి. వాగుపరివాహక ప్రాంతాల్లో జలకళ సంతరించుకున్నది. సమీప గ్రామాల్లో రైతులు రెండు పంటలు పండిస్తున్నారు. పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.
నీటి వృథాకు చెక్..
పురుసంపల్లి కొండల్లో చిన్న జలధారలా ప్రారంభమై రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్, తిమ్మాజిపేటలో నది రూపు సంతరించు కున్నది. వానకాలంలో ఎగువన కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు అలుగుపారి ఈ నదిలో చేరి వృథాగా వరద నీరు కిందకు పోతుంది. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చొరవ తీసుకొని చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రతిపాదించారు. కాంగ్రెస్ హయాంలో వాగు పరివాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగేందుకు డైక్ సిస్టంలు ఏర్పాటు చేయగా.. ఇది పనికి రాకుండా పోయింది.
వాగులో చెక్‌డ్యాంలు నిర్మించి నీటిని నిల్వ చేస్తే పరివాహక ప్రాంతాలే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్బ జలాలు పెరుగుతాయని ప్రభుత్వానికి నివేదించడంతో జడ్చర్ల నియోజకవర్గంలో ఎనిమిదేండ్లుగా 22 చెక్‌డ్యాంలు నిర్మించారు. నీటివృథాకు చెక్‌పెట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అంతేగాక భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటిఊటలు ఉబికివస్తున్నాయి.
బోరులో ఉబికివస్తున్న నీరు
పెద్దకొత్తపల్లి, డిసెంబర్ 12: ప్రభుత్వం ముందుచూపుతో నిర్మించిన ప్రాజెక్టులు నీటితో నిండి వాటి నుంచి ప్రతి గ్రామంలోని చెరువు, కుంటలకు చేరడంతో కళకళలాడుతున్నాయి. ఎటుచూసినా నీటి కమతాలు ఉండటంతో భూగర్భజలాలు పెరిగి భూఉపరితలానికి ఉబికి వస్తున్నాయి. జొన్నలబొగడ రిజర్వాయర్ సమీపంలో, పెద్దకొత్తపల్లి మండలం చంద్రబండతండా వద్ద 20రోజుల కిందట సర్పంచ్ రాంలాల్ బోరు డ్రిల్లింగ్ చేశారు. దీంతో 5 ఇంచుల నీళ్లు పడ్డాయి.
సర్పంచ్ రాంలాల్, కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అనుకున్నవిధంగా సేద్యం చేసుకోవచ్చని రాంలాల్ బోరుకు కేసింగ్ పైపు బిగించారు. అయితే, సోమవారం తెల్లవారుజామున నుంచి కేసింగ్ నుంచి నీరు ఉబికి వస్తుంది. గమనించిన కొందరు రైతులు విషయాన్ని గ్రామస్తులకు తెలుపడంతో వారు బోరు నుంచి వస్తున్న నీటిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జడ్చర్లకు జలసిరి..
దుందుభీనది చెక్‌డ్యాంలతో కళకళలాడు తుండగా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గం జలసిరులతో నిండిపోనున్నది. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిన జడ్చర్ల హైదరాబాద్ నగరాన్ని తలపించేలా దూసుకుపోతున్నది. ఇప్పటికే మొక్కజొన్న, పత్తి మార్కెట్‌కు కేరాఫ్‌గా నిలిచిన జడ్చర్లకు సాగునీరు పూర్తిస్థాయిలో అందితే అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే పారిశ్రామిక, రియల్ ఏస్టేట్కు కేంద్రంగా మారిన జడ్చర్ల.. హైదరాబాద్-బెంగళూరు రహదారికి అనుకొని ఉండటం కూడా కలిసివచ్చింది. ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ఖరీదైన నగరంగా మారుతుందనడంలో సందేహం లేదు.
కేసీఆర్ కలలు నిజమవుతున్నాయి
తెలంగాణ ఉద్యమం సమయంలో సీఎం కేసీఆర్ పాలమూరు జిల్లా పరిస్థితిని చూసి కండ్ల నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్లను పూర్తిచేసి కలలు నిజం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్ల జడ్చర్ల రూపురేఖలు మారిపోయాయి. భవిష్యత్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే తెలంగాణకే మా ప్రాంతం ఐకాన్‌గా మారుతుంది. రాష్ట్రంలోనే అత్యధిక చెక్‌డ్యాంలు నిర్మించి జలసిరులు ఒడిసి పట్టినం. రైతుల మేలుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా చేస్తున్నది.
– లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల