మహబూబ్‌నగర్, డిసెంబర్ 29 : గతేడాదితో పోల్చితే ఈ ఏడాది దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై లైంగికదాడులు, హత్యలు కిడ్నాప్‌లు, దారిదోపిడీలు, హత్యలు, సైబర్ నేరాలు పెరిగాయి. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా దొంగలు బీభత్సం సృష్టించారు. రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. నేరాలు, చోరీలను అదుపు చేయడంలో జిల్లా పోలీసు శాఖ పురోగతి సాధించలేకపోయింది. జిల్లాలో 2023లో 5,867 కేసులు నమో దు కాగా 2024లో 5,887 కేసులు నమోదవ్వడం విశేషం. అయితే చిన్నపాటి నేరాలు, సైబర్ నేరాలు, చీటింగ్ వంటి మోసాల్లో గతడాది కంటే గణనీయమైన పెరుగుదల నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో 2024 ఏడాదికి సంబంధించి క్రైం రౌండప్‌పై ఆదివారం ఎస్పీ జానకి విలేకరుల సమావేశంలో క్రైం నివేదికను విడుదల చేసి ప్రధాన కేసుల వివరాలను వెల్లడించారు.
జిల్లాలో నమోదైన ఎఫ్ఐఆర్ కేసుల్లో జడ్చర్ల పోలీసు స్టేషన్ 913 కేసులతో మొదటి స్థానంలో ఉండగా మహబూబ్‌నగర రూరల్‌లో 844 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా మహిళా పోలీసు స్టేషన్ 130, మూసాపేట్ పోలీసు స్టేషన్ 204 కేసులు న మదవ్వడం విశేషం. మహబూబ్‌నగర్ వన్‌టౌన్‌లో 332, టుటౌన్‌లో 438, కోయిలకొండలో 242, హన్వాడలో 255, నవాబ్‌పేటలో 310, మహ్మదాబాద్‌లో 314, భూత్పుర్‌లో 308, మూసాపేటలో 204, అడ్డాకులలో 226, దేవరకద్రలో 238, బాలానగర్‌లో 301, రాజాపూర్‌లో 301, మిడ్జిల్‌లో 300 కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు.
జిల్లాలో గతేడాది కంటే ఈ సారి రోడ్డు ప్రమాదాలు అధికమవడంతోపాటు మరణాల సంఖ్య పెరిగింది. 257 కేసుల్లో 273 మంది వాహనదారులు మృతి చెం దారు. 272 కేసుల్లో 476 మంది వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది కంటే ఈ ఏడాది ఎంవీఐ యాక్టు కేసులు 1,74,955, డ్రంకన్ డ్రైవ్ కేసులు 2,033 నమోదయ్యాయి. అయితే జైలుకు వెళ్లిన వారి సంఖ్య తగ్గింది. రూ.8,20,98,515 జరిమానాలు విధించారు.
ఈ ఏడాది జిల్లాలో చోరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పుర్ మున్సిపాలిటితోపాటు గ్రామాల్లోనూ దొంగలు హడలెత్తించారు. అయితే దొంగతనాలను అరికట్టడంతోపాటు, చోరీకి గురైన సొమ్ము రికవరీ చేయడంలోనూ పోలీసులు వెనుకబడ్డారు. చోరీ అయిన సొమ్ము రూ.3 కోట్ల 83 లక్షలు ఉంటే రికవరీ మాత్రం రూ.కోటి మాత్రమే చేశారు.