భూత్పూర్ : యోగా చేయడం వలన మానవుని జీవన ప్రమాణస్థాయి పెరుగుతుందని శిశు మందిర్ జిల్లా అధ్యక్షుడు యోగేందర్ రెడ్డి( Yogendar Reddy ) అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా ( International Yoga ) దినోత్సవ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో గత పది సంవత్సరాల క్రితం మానవుని సగటు జీవిత కాలం 55- 60 ఏళ్లు ఉండగా ఇప్పుడు 70 సంవత్సరాలకు చేరిందని అన్నారు.
పది ఏళ్ల కాలంలో అనేక మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని యోగపై ఆసక్తిని పెంచుకున్నారని పేర్కొన్నారు. ధ్యానం, ఆహారపు అలవాట్లలోను మార్పులు వచ్చినట్లు గుర్తు చేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచి యోగాను చేయడం వల్ల ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన మేధస్సుతో అనుకున్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలవుతుందని తెలిపారు.
కార్పొరేట్ స్థాయిలో తగ్గని జబ్బులకు యోగ ఒక మంచి మెడిసిన్ అని వివరించారు. గతంలో రసాయన ఎరువులతో కాకుండా సేంద్రీయ ఎరువులతో వ్యవసాయం చేసేవారని, దీని మూలంగా ఆహారం కల్తీ లేకుండా ఉండేదని తెలిపారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం మూలంగా మానవుడి శరీరంలో వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శిశు మందిర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజు, జిల్లా విభాగ్ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ నాయకులు సత్తుర్ అశోక్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మయ్య, వెంకటరాజు, ఉపాధ్యాయ బృందం రాజశేఖర్ రెడ్డి, రఘురాం రెడ్డి, రేవతి తదితరులు పాల్గొన్నారు.