గట్టు, జూలై 30 : మనుషుల్లో మానవత్వం క రువైందనడానికి ఆలూరులో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఇరువురికి చెందాల్సిన భూమిని ఒక్కడే అ నుభవిస్తూ.. తోడబుట్టిన అన్న కుమారుడికే ఆస్తిని పంచి ఇవ్వక అతడి ఆత్మహత్యకు కారకుడయ్యాడు ఆ చిన్నాన్న. భాగపరిష్కారం అయ్యేవరకు మృతదేహాన్ని ఖననం చేయమని అందరూ తేల్చిచెప్పడంతో అప్పుడు మనసు కరిగింది. దీంతో మృతదేహం ఖననం జరిగి కథ అక్కడితో సుఖాంతమైంది.
ఈ హృదయ విదార క ఘటన వివరాలు ఇవీ. ఆలూరులో తమ పెద్ద ల నుంచి కుమ్మరి గోవిందుకు 4 ఎకరాల పొలం వచ్చింది. ఇది అతనితోపాటు అతని అన్న పెద్ద రంగన్న కుమారుడు ఆనంద్కు చెందాలని పెద్దలు నిర్ణయించారు. ఈ పొలంతోపాటు కుమ్మరి నాగమ్మకు చెందిన 1.22 గుంటల భూమి కూడా ఇద్దరికీ చెందాలని ఒప్పందం. కాగా తనకు రావాల్సిన వాటా పొలాన్ని తన పేర రిజిస్ట్రేషన్ చేయించాలని ఏండ్లుగా ఆనంద్ తన చిన్నాన్నను అడుగుతూ వచ్చాడు. అయితే ఎప్పటికప్పుడూ ఆయన దాన్ని వాయిదా వేశాడు.
ఈ క్రమంలో పొలం తనకు రాదని మనస్తాపం చెంది ఆనంద్ పురుగుల మందు తాగాడు. కాగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆనంద్కు భార్య ఉన్నది. కాగా, చాలా కాలం తరువాత ఆనంద్కు ఇటీవల కవల పిల్లలు జన్మించారు. చిన్న వయస్సులోనే ఆస్తి తగాదాల కారణంగా భార్యాపిల్లలకు దూరం కావడం అందరినీ కలిచివేస్తోంది.
ఆలూరులో ఈ ఘటన గురించే మంగళవారం చర్చ కొనసాగింది. కాగా భాగపరిష్కా రం పూర్తయ్యేదాకా మృతదేహాన్ని ఖననం చేయమని చెబుతూ ఆనంద్ కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు తాసీల్దార్ కార్యాలయానికి మంగళవారం వచ్చారు. తాసీల్దార్తో మాట్లాడామని, భాగపరిష్కారానికి ఆమె హామీ ఇచ్చినట్లు ఆనంద్ కుటుంబసభ్యులు, గ్రామస్తులు చెప్పారు. ఈ ఘటనపై తాసీల్దార్ సరితారాణిని ఫోన్లో వివరణ కోరగా తనకు తెలియదన్నారు. రైతులెవరూ తన వద్దకు రాలేదని చెప్పారు. ఫోన్లో వివరాలు అడిగితే ఎలా? కార్యాలయానికి వచ్చే వివరాలు తెలుసుకోవాలంటూ ముక్తసరిగా ముగించారు.