మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 26 : ఇతర దేశాలతో సమానంగా భారత దేశం మరింత అభివృద్ధ్ది చెందాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగం అందించి అమలు చేసిన రోజునే గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినపటికీ మహిళలపై జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ న్యాయకత్వంలో సాగు, తాగు నీటితోపాటు విద్యా,వైద్య రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనల్లో సంక్షేమం, అభివృద్ధి ఎట్లా జరిగిందో చూశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు మాట దేవుడెరుగు ఉన్న గతంలో చేసిన పనులను కూడా పూర్తిచేయలేని పరిస్థితిలో ఉందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు దేవేందర్, వెంకటయ్య, శ్రీనివాస్‌రెడ్డి, గణేశ్, కోట్ల నర్సింహ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల త్యాగాల ఫలితమే..
వనపర్తి టౌన్, జనవరి 26 : మహానీయుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్ర ఫలాలు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి మహానీయులకు పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ స్వా తంత్య్రం సిద్దించిన అనంతరం ప్రజాబద్ధంగా, చట్టబద్దంగా నాగరికపాలన, ప్రజాస్వామ్యపాలన సాగించడానికి మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి అమలులోకి తెచ్చిన సందర్భంగా జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటు న్నామన్నారు.
అదేవిధంగా కేసీఆర్ త్యాగ ఫలితం, ఆయన అ ద్భుతమైన వ్యూహం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమతీరు , ఎన్నో త్యాగాల ఫలితంగా దశాబ్దాల కల తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందన్నారు. కేసీఆర్ అద్భుత పాలనతో తెలంగాణలో సుపరిపాలన జరిగి అభివృద్ధిలో అగ్రభాగాన తెలంగాణ నిలిచిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిది వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్‌గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..
అలంపూర్ చౌరస్తా, జనవరి 26 : భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినంగా జరుపుకొంటామని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ముందుగా ఆయన అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.