కల్వకుర్తి, జనవరి 7: ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుంటిసాకులు చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతూ.. రోజుకొక రాగం తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులను ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామాకు సిద్ధమని ప్రకటించాలన్నారు. రుణమాఫీ కాని రైతుల నుంచి గ్రామాలవారీగా జాబితా సేకరించడంలో భాగంగా మంగళవారం కల్వకుర్తి వ్యవసాయ మా ర్కెట్ యార్డులో రైతు జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు జేఏసీ నాయకుడు రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ..
ఇప్పటి వరకు రుణమాఫీ 50శాతానికి మించలేదని, ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం రుణమాఫీ విషయంలో పొంతన లేకుండా సమాధానాలు ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కోసం గ్రామాల్లో రైతులు ఎదురుచూస్తున్నారని, పంట రుణం కలిగిన ప్రతిరైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లో కాంగ్రెస్ పార్టీ తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని హెచ్చరించారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నూటొక్క రాగం తీసి ఏదో పాటపాడినట్లు.. ఏడాది కాలంగా కమిటీ అంటూ కాలాయాపన చేసి చివరకు ఎకరాకు రూ.12వేలు ఇస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ రైతుభరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.15వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారం వచ్చాక కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఏడాదిగా కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రకారకాల లీక్‌లు ఇస్తూ రైతాంగాన్ని అయోమయానికి గురిచేశారని, రైతుల ఉసురు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తగులుతుందని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడాది దాటిందని, రైతు రుణాలకు సంబంధించి ఏడాదిగా వడ్డీని కూడా ప్రభుత్వమే భరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. ఇవేవి ఇవ్వకుంటే.. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో హామీలు అమలు చేయడంలో విఫలం చెందాం.., తప్పయిపోయిందని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సరైన పాలన అందిస్తామని చెప్పి తిరిగి ఎన్నికలకు రావాలని సూచించారు. కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకలు యాదగిరిరెడ్డి, కృష్ణగౌడ్, తిరుపతిరెడ్డితోపాటు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.