గద్వాల, మే 17 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధిలో జిల్లా పరుగులు పెడుతున్నది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్ర పాలకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గం తప్పనిసరి. గతంలో గతుకుల రోడ్లు, శిథిలావస్థకు చేరిన బ్రిడ్జీలపై వాహనదారులు భయపడుతూ ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఉండేది. సమయం వృథా అవడంతోపాటు వాహనాలు దెబ్బతిని.. ఇంధనం ఖర్చు కూడా పెరిగేది. తెలంగాణ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ విడుతల వారిగా జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో నాటి రాళ్లబాటలన్నీ నేడు రాచబాటలుగా మారాయి. దీంతో ప్రయాణం సాఫీగా, తక్కువ సమయంలో చేరుకుంటున్నారు. ప్రధాన రహదారులపై ఉన్న పురాతన బ్రిడ్జీల స్థానంలో నూతనంగా నిర్మించడంతో రోడ్లన్నీ తళుక్కుమంటున్నాయి.
2014 తర్వాత జిల్లాలో నిర్మించిన రహదారులు, వంతెనల నిర్మాణంపై ప్రత్యేక కథనం జిల్లాలో రహదారుల నిర్మాణం ఇలా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాలో పలు ప్రధాన రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. గద్వాల నుంచి రాయిచూర్‌కు వెళ్లే 6.5 కిలోమీటర్ల రహదారిని రూ.8.21కోట్లతో, జాతీయ రహదారి నుంచి మానవపాడు వరకు నాలుగు కిలోమీటర్ల డబుల్ రోడ్డును రూ.5.2కోట్లతో, గద్వాల-అయిజ రహదారిలో మూడు కిలోమీటర్ల డబుల్ బీటీ రోడ్డును రూ.3.6కోట్లతో నిర్మించారు. జాతీయ రహదారి నుంచి ఇటిక్యాల వరకు రూ.8.5కోట్లతో 5 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మించారు. అయిజ నుంచి ఎరిగేర వరకు రూ.16.88కోట్లతో 12 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు, కర్ణాటక బార్డర్ నుంచి గట్టు మండలం మిట్టదొడ్డి వరకు రూ.10.6కోట్లతో 10కిలోమీటర్ల రోడ్డుకు గానూ ప్రస్తుతం 4కిలోమీటర్లు పూర్తి చేశారు. అయిజ- రాజపూర్ మధ్య రూ.10.6కోట్లతో 10 కిలోమీటర్ల రోడ్డుకుగానూ ప్రస్తుతం 3 కిలోమీటర్లమేర పూర్తి చేశారు. మల్దకల్-అయిజ 9కిలోమీటర్ల రోడ్డును రూ.9.25కోట్లతో పూర్తి చేశారు. రహదారుల నిర్మాణంతో వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి.
వంతెనల నిర్మాణం ఇలా..
వానకాలం వస్తే.. నందిన్నె, బొంకూరు, కలుగొట్ల, సాతర్ల గ్రామాల ప్రజలు పట్టణాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడేవారు. వాగులు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారులపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయేవి. నందిన్నె, బొంకూర్ బ్రిడ్జీలను ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటేవారు. స్వరాష్ట్రం సిద్ధించాకే నూతన వంతెనలు నిర్మించడంతో ప్రయాణం సుగమమైంది. బొంకూరు వద్ద రూ.10.6కోట్లతో, నందిన్నె వద్ద రూ.7.95కోట్లతో, అయిజలో రూ.7కోట్లతో, కలుకుంట్ల బ్రిడ్జీని రూ.5.5కోట్లతో, సాతర్ల వద్ద రూ.2.5కోట్లతో, షేక్‌పల్లి, గార్లపాడు గ్రామాల మధ్య రూ.2.5కోట్లతో, గట్టు, ఎక్లాస్పూర్ గ్రామాల మధ్య రూ.6.2కోట్లతో, ఇమాంపూర్ వద్ద రూ.2.7కోట్లతో, బైరాపురం వద్ద రూ.కోటితో నూతన వంతెనలను ప్రభుత్వం నిర్మించింది.