నాగర్‌కర్నూల్, మే 3 : ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లా డిండికి నీటిని తరలించే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నీటిని మళ్లించడం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు సమ్మతించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఈనెల 1వ తేదీన సాగునీటి ప్రాజెక్టుల సందర్శించడంపై నాగం జనార్దన్‌రెడ్డి స్పందిస్తూ శనివారం ప్రకటన విడుదల చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నాగర్‌కర్నూల్ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం సంతోషమే అయినా ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీటిని తరలింపును జిల్లా ప్రజల సమ్మతించరని పేర్కొన్నారు.
అదనంగా 0.5 టీఎంసీల నీటిని తీసుకెళ్లాలంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ చేసి తీసుకుపోవాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కెనాల్ ప్యాకేజీ-3లో సున్నపురాళ్లతండా నుంచి కుడికిళ్ల వరకు దాదాపు మూడున్నర కిలో మీటర్ల మేరకు కెనాల్ అసంపూర్తిగా ఉన్నందునా నార్లాపూర్ రిజర్వాయర్ నీటిని ఏదుల రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లకు నీరందదన్నారు. యుద్ధ ప్రాతిపదికన మూడున్నర కిలో మీటర్లు కెనాల్ పూర్తి చేస్తే జూలై మొదటి వరకు ఆ కాల్వ ద్వారా నీరు ఏదుల, వట్టెం తదితర రిజర్వాయర్లకు అందించే వీలుంటుందన్నారు.
పెండింగ్‌లో ఉన్న మూడున్నర కిలో మీటర్ల కాల్వ కోసం ప్రత్యేకాధికారిని నియమించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి ఎత్తిపోస్తున్న నీటిని 12 లక్షల ఎకరాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నుంచి ప్రధాన కాలువలు, పిల్ల కాల్వలు, పంట కాల్వలు నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే పేర్కొన్నారు. దానికి వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని, కేవలం మాటలతో పని కాదన్నారు.
నిజంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే వారైతే డిస్టిబ్యూటరీ నెట్వర్క్ వెంటనే చేపట్టి ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేస్తే పాత మహబూబ్‌నగర్ జిల్లాకు లాభం చేకూరుతుందని, అప్పుడు రైతులు బాగుపడుతారన్నా రు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపుహౌస్ పక్కనే పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్ నిర్మించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, అక్కడ జరిపిన బ్లాస్టింగ్‌లో మేము చెప్పినట్లుగానే బ్లాస్టింగ్ ప్రభావంతో 5 మోటర్లలో 2 మోటర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు.
ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగిందని, బీహెచ్ఈఎల్ నిపుణులు ఆ రెండు మోటర్లకు మరమ్మతు చేయడానికి కూడా వీలు లేకుండా నష్టం జరిగిందన్నారు. ఆవిధంగా రిపోర్టు ఇచ్చిన కారణంగా వాటి స్థానంలో కొత్తగా 2 మోటర్లను అమర్చి కాలువల సామర్ధ్యాన్ని పెంచి రైతులు కోరుకునే విధంగా నీటిని అందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదుల నుంచి నీటిని డిండికి మళ్లించడం ఈ జిల్లా ప్రజలు సమ్మతించడం లేదని, దీనికి దృష్టిలో ఉంచుకోవాలని, ఈప్రాంత రైతులకు అన్యాయం చేసే విధంగా ప్రాజెక్టుల విషయంలో ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు.