మాగనూరు : మండలంలోని వడ్వాట్ గ్రామం అడవి సత్యారం పెద్దవాగు నుంచి ఇసుక అక్రమంగా( Illegal Sand ) తరలిపోతుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇష్టారాజ్యంగా అనుమతులకు మించి ఇసుకను తరలిస్తున్నారు. సోమవారం ఇసుకను అక్రమ తరలిస్తున్న వాహనాలను మాగనూరు పోలీసులు( Police) , రెవెన్యూ( Revenue) సిబ్బంది పట్టుకుని వదిలేయడం విమర్శలకు తావిస్తోంది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు వడ్వట్ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు( Indiramm Houses) మాగనూరు తహసీల్దార్ సురేష్ ట్రాక్టర్ల ద్వారా మూడు ట్రిప్పులకు అనుమతి ఇచ్చారు. మనషుల ద్వారా ట్రాక్టర్లలో నింపి ఇసుక తరలించాల్సి ఉండగా జేసీబీ పెట్టి మూడు ట్రిప్పుల కన్నా అధిక సంఖ్యలో ఇసుక తరలించారు. తరలించిన ఇసుకను రూ. 3 వేల చొప్పున ఇసుక అమ్ముకుంటున్నట్లు స్థానికులు ఆరోపించారు.
జేసీబీ ద్వారా ఇసుక తరలిస్తుండగా మాగనూరు పోలీస్ సిబ్బంది పట్టుకొని స్థానిక ఎస్సై అశోక్ బాబుకు, తహసీల్దార్‌కు సమాచారం అందజేశారు. అయితే కొద్దిసేపటికే పట్టుకున్న వాహనాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.